2024లో బాబు సీఎం అయితే......ఏపీకి ఈస్ట్ మన్ కలరేనా...?

Update: 2022-08-04 00:45 GMT
ఏపీ మీద దాని భవిష్యత్తు మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీ బాగుపడాలని అందరికీ ఉంది. అయితే ఆ పరిస్థితి ఏపీలో ఉందా అన్నదే అందరి సందేహం. ఏపీ ఇపుడు అంటే ఈ రోజుకు ఏడు లక్షల కోట్ల రూపాయల పై చిలుకు అప్పుల్లో ఉంది. ఇవి కాకుండా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర సాయం శూన్యం. రాజధాని లేదు, నికరమైన ఆదాయం లేదు. ఇక ఉపాధి రంగం పడకేసింది, పరిశ్రమలు కూడా లేవు, పెద్దగా రావు.

ఇదీ ఏపీ లేటెస్ట్ పిక్చర్. ఒక విధంగా చెప్పాలీ అంటే విభజన తరువాత ఏపీకి ఇప్పటికీ మరింతగా భారంగా మారిపోయింది. చంద్రబాబు 2014లో విభజన ఏపీకి తొలి సీఎం అయ్యాక బాగానే చేసుకొచ్చారు. అయితే అప్పులు కూడా చేశారు. కానీ అప్పట్లో అవి పెద్దగా భారంగా ఎవరికీ తోచలేదు. వాటితో సంపద సృష్టికి బీజాలు పడుతున్నాయనుకున్నారు. కానీ ఆయన సర్కార్ మారి జగన్ రావడంతో ఒక్కసారిగా  సీన్ మారింది.

జగన్ మార్క్ విజన్ లో సంక్షేమం ముందుకు వచ్చింది. అమరావతి వెనక్కు పోయింది. దాంతో మరో అయిదేళ్ళ కాలం వేస్ట్ అయింది. రేపటి రోజున జగన్ దిగి బాబు సీఎం అయినా ఏపీని లాక్కురావడం అంత ఈజీ కాదని అంటున్నారు. బీజేపీ మద్దతుతో వచ్చినా లేక సొంతంగా బాబు అధికారం చేపట్టినా కూడా పాలన సజావుగా సాగ‌డం కష్టమే అంటున్నారు.

ఎందుచేతనంటే 2024 నాటికి ఏపీ అప్పులు కచ్చితంగా పది లక్షల కోట్లకు చేరుతాయని అంటున్నారు. వాటికి వడ్డీలే ఏటా యాభై నుంచి అరవై వేల దాకా కట్టాల్సి ఉంటుంది. దాంతో ఏడాదికి అయ్యే బడ్జెట్ రెండు లక్షల పై చిలుకు ఉంటుంది. దాంతో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయెలేని పరిస్థితి. అలాగే ఈ రెండు లక్షల కోట్లను ఏలా సమకూర్చుకోవాలీ అన్నది అతి పెద్ద ప్రశ్న. అంటే మళ్లీ అప్పులే చేయాలి.

కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ఏపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏ విధంగానూ మారదనే అంటున్నారు. అక్కడ సీఎం లుగా జగన్ ఉన్నా బాబు ఉన్నా వారికి ఏమీ తేడా లేదు. ఏపీ నుంచి ఏలాగోలా రాజకీయ మద్దతు కేంద్రంలో తీసుకుని తమ పబ్బం గడుపుకుంటారు తప్ప ఏపీకి ఏమీ చేయరని ఇప్పటికే తేలిపోయిన వేళ బాబు సీఎం అయినా ఏపీకి ఏం చేయగలరు అన్న సందేహం అయితే మేధావుల్లో, పెద్దల్లో వస్తోంది. పైగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అయితే బాబు మీద పాత కాలం కోపాలను అలాగే అట్టేపెట్టుకుని ఏపీ వైపు అసలు చూడరని కూడా అంటున్నారు. మొత్తానికి ఏపీ తలరాత ఇప్పట్లో మారే చాన్స్ లేదనే అంటున్నారు అంతా.
Tags:    

Similar News