మోడీ.. ఇమ్రాన్ మధ్య తేడాను 'టైం' చెప్పేసింది

Update: 2019-09-28 05:31 GMT
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో దాయాది దేశాలకు చెందిన ఇద్దరు ప్రధానులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడటం తెలిసిందే. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది. ప్రపంచ వేదికకు సరిసమానమైన వేదిక మీద ఇద్దరు ప్రధానులు మాట్లాడిన మాటలు ఇప్పటికే చర్చనీయాంశాలుగా మారాయి. మోడీ ప్రసంగానికి ఏ మాత్రం పోలిక లేకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పీచ్ సాగింది.

ప్రపంచానికి భారత్ ఏం ఇచ్చింది? రానున్న రోజుల్లో ప్రపంచ హితం కోసం భారత్ ఏం చేయనుంది? తమ ముందున్న లక్ష్యాల గురించి మోడీ మాట్లాడితే.. భారత్ మీద తనకున్న కసిని పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రదర్శించారు. తన మాటలతో ఉద్రేకాన్ని పెంచటమే కాదు.. భారత్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో ప్రాశ్చాత్య దేశాలు ముస్లింలను తేడాగా చూస్తున్న అర్థం వచ్చేలా మాట్లాటం ద్వారా కొత్త కలకలానికి తెర తీశారు.

అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడే ప్రతి మాట యావత్ ప్రపంచం చూడటమే కాదు.. దానికి సంబంధించిన పరిణామాలు చాలానే ఉంటాయి. ఐక్యరాజ్య సర్వప్రతినిధి సభలో తొలుత మోడీ ప్రసంగించిన తర్వాత ఇమ్రాన్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదిక మీద ఎవరేం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టం. కాకుంటే.. అక్కడ కూడా కొన్ని సంప్రదాయాలు.. మర్యాదలు ఉంటాయి. ఆ విషయంలో మోడీ తూచా తప్పకుండా వ్యవహరిస్తే.. పాక్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

సమితి వేదిక మీద ఒక దేశాధినేతకు ప్రసంగించటానికి 15 నుంచి 20 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. అంతకు మించి ప్రసంగిస్తుంటే.. సమయం మించిపోయిందన్న విషయాన్ని చెప్పేలా రెడ్ లైట్ వెలిగేలా చేస్తారు. ఈ విషయంలో మోడీ ఆచితూచి అన్నట్లుగా తన ప్రసంగాన్ని కేవలం 17 నిమిషాల్లో ముగించారు. తనకు ఇచ్చిన సమయం కంటే మూడు నిమిషాల ముందే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

అందుకు భిన్నంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యవహరించారు. ఆయన ఏకంగా 50 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయనకు కేటాయించిన సమయం మించిపోయినా మాట్లాడుతూనే ఉన్నారు.ఆయనకు ఇచ్చిన సమయానికి మించిన అరగంటసేపు మాట్లాడారు. టైం అయిపోయిందన్న విషయాన్ని తెలిపేలా ఎర్ర లైటు వెలిగినా.. దాన్ని పట్టించుకోకుండా ఇమ్రాన్ 50 నిమిషాలు మాట్లాడం చూస్తే.. ప్రపంచ వేదిక మీద తనకున్న మర్యాద ఎంతన్నది ఇమ్రాన్ ఇట్టే ప్రదర్శించారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News