ఒక్క ఓటమికే ఇంత వైరాగ్యమా?

Update: 2022-06-04 04:29 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబులో బాగా వైరాగ్యం వచ్చేసినట్లుంది. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏగా కానీ ఎంపీగా కానీ తాను ఎక్కడి నుండి పోటీచేయటం లేదని స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖపట్నం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ రాష్ట్రంలో ఏదో చోట నుండి పోటీ చేస్తారని ఎవరికీ తెలీని రహస్యాన్ని బయటపెట్టారు.

మొన్నటి ఎన్నికల్లో నాగబాబు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసిన విషయం తెలిసిందే. మూడో స్ధానంలో నిలిచినా 2.5 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఓడిపోయిన నాగబాబుకు 2.5 లక్షల ఓట్లు రావటమంటే గొప్పనే చెప్పాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారనే ప్రచారం పెరిగిపోయింది.

అయితే ఇక్కడ నుండి జనసేన తరఫున వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేయబోతున్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది. దాంతో నాగబాబు కన్ను ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, వైజాగ్ స్ధానాలపైన పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపధ్యంలోనే తాను పోటీకి దూరమని స్వయంగా ఆయనే ప్రకటించటం గమనార్హం. నాగబాబు పోటీకి ఎందుకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారో అర్ధం కావటంలేదు.

ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షం గా ఉంది. బీజేపీ+జనసేనతో టీడీపీ కలుస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకవేళ టీడీపీ కలవకపోయినా పవన్ లెక్కప్రకారం జనాలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపోతున్నారు.

కాబట్టి పోయిన ఎన్నికలకన్నా వచ్చే ఎన్నికల్లో నాగబాబు గెలుపుకు ఎక్కువ అవకాశాలున్నాయి. పవన్ అంచనా ప్రకారం గెలుపు ఇంత స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు పోటీకే ఎందుకు దూరమవ్వాలని డిసైడ్ అయినట్లు ? తాను పోటీకి దూరంగా ఉండి టోటల్ ప్రచార బాధ్యతలను భుజానేసుకోవాలని అనుకుంటున్నారా ? అన్న విషయమే అర్ధం కావటంలేదు. చూద్దాం తొందరలోనే తన నిర్ణయానికి కారణాలు చెప్పకుండా ఉంటారా ?
Tags:    

Similar News