సీఎం కేసీఆర్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమా? పంచాంగ శ్రవణం చెప్పిందేంటి?

Update: 2023-03-22 19:00 GMT
మిగిలిన పండుగలకు ఉగాదికి ఒక తేడా ఉంది. తెలుగు వారి కొత్త సంవత్సరం వేళ.. మిగిలిన పండగుల మాదిరి అన్నీ ఉంటాయి. వాటితో పాటు.. పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా ఉంటుంది. చివరకు ప్రభుత్వాలు సైతం ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో నిర్వహించిన శ్రీ శోభకృత నామ సంవత్సర పంచాంగాన్ని పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అవిష్కరించారు.
ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ఈ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు కేటీఆర్ కానీ హాజరు కాకపోవటం గమనార్హం. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శారదా పీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణాన్ని పఠించారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

పాలకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఒకటికి నాలుగుసార్లు ప్రస్తావించటం గమనార్హం. ఈ పంచాంగ శ్రవణం విన్నంతనే.. రాబోయే రోజుల్లో పాలన అంత సజావుగా సాగదన్న భావన కలుగక మానదు. అదే సమయంలో.. అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని ప్రస్తావించినట్లుగా కనిపిస్తుంది. పండితులు బాచంపల్లి చేసిన పంచాంగ శ్రవణంలోని కీలక అంశాల్ని చూస్తే..

-  ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తుంది. కొంత మంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయి. పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

-  నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది నిండబోతున్నాయి.

-  ఈ ఏడాది విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. విద్యాశాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది.

-  న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయి.

-  ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలి. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతంలో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది.

-  అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయి. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారు.

-  మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. పోలీసులు బాగా పనిచేసే అవకాశం ఉంది.

-  ధరలు తగ్గబోతున్నాయి. ఏప్రిల్‌లో విపరీతమైన ఎండలు ఉంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News