సైకో భర్తల్నే కాదు.. సైకో భార్యల్ని కూడా మీ మాటల్లో చేర్చండి వాసిరెడ్డి పద్మగారు?

Update: 2022-11-19 04:29 GMT
ఆడ.. మగ అన్న తేడా ఈ డిజిటల్ యుగంలో కూడానా? అన్న ప్రశ్న వేస్తే.. కొందరు ఓకే అంటారు కానీ మరికొందరు మాత్రం ఆ మాటతో పూర్తిగా విభేదిస్తారు. నిజమే.. వారి మాటల్లోనూ కాస్తంత న్యాయం ఉందనే చెప్పాలి. అయితే.. గతంతో పోలిస్తే వర్తమానంలో ఆడ.. మగ అన్న తేడా లేకుండా హింసకు పాల్పడటంతో పాటు.. దారుణ నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

గతంలో భార్యను హతమార్చిన భర్త లాంటివి మాత్రమే చూసే దానికి బదులుగా.. ఇప్పుడు మారిన కాలానికి ప్రతీక అన్నట్లుగా భర్తను చంపేసిన భార్య అన్న హెడ్డింగులు ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. ప్రియుడి కోసమో.. మరో కారణం కోసమో ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడుతున్న మహిళల ఉదంతాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళ.. ఇలాంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు భార్యను మాత్రమే కాకుండా భర్తల్ని వేధించుకు తినే వారి ప్రస్తావన తేవాల్సిన సమయం వచ్చేసింది.

ఈ మార్పును పాలకులు సైతం గుర్తించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. తాజాగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి పద్మ పేరుతో విడుదలైన ఒక ప్రకటనను చూసినంతనే ఒక మాట గుర్తుకు రాక మానదు. అనుమానం పేరుతో మహిళల ప్రాణాలు తీసే సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలని ఆమె కోరారు. నిజమే..

ఆమె ఆగ్రహం ధర్మాగ్రహం. అందులో తప్పు లేదు.అలాంటి వారికి అలాంటి కఠినమైన శిక్షలు ఉండాల్సిందే. కాకుంటే.. మేడమ్ గుర్తించాల్సిన మరో అంశం ఏమంటే.. తప్పుడు పనులు చేసే భార్యలు.. భర్తల్నిచంపేందుకు సైతం వెనుకాడని భార్యలను సైతం సంఘ బహిష్కరణ చేయాలన్న మాట వస్తే మారిన కాలానికి తగ్గట్లు ఉండటంతో పాటు.. అందరి మనసులు గెలుచుకునే వారని చెప్పాలి.

తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లల్ని ఎంత ముద్దు చేసినా.. తప్పు చేస్తే తాట తీస్తుంటారు. తప్పులు చేయొద్దని గట్టిగా గదమాయిస్తుంటారు. అంతమాత్రానికి పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ లేదనా? ఇష్టం లేదా? అని కాదు కదా? అలానే మహిళా సంరక్షణ కోసం.. మహిళల బాగు కోసం..

వారి హక్కుల కోసం ఏర్పడిన కమిషన్ ను వారి హక్కుల పరిరక్షణతో పాటు.. వారిలో ఎవరైనా తప్పులు చేస్తే బాగోదన్న బెదిరింపు కూడా మంచిదే కదా? అది కూడా మారి మేలు కోరే కదా? అందుకే.. సైకో భర్తలే కాదు సైకో భార్యల విషయంలోనూ వాసిరెడ్డి పద్మ లాంటి వారు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News