చైనా బార్డర్​లో టెన్షన్​.. టెన్షన్​ ఇక యుద్ధమేనా!

Update: 2020-09-10 17:33 GMT
భారత్​, చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. చైనా యాప్​లను నిషేధించడంతో ఆ దేశం రగిలిపోతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం భారత్​, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీనరేఖ వద్ద కాల్పులు చెలరేగాయి. ఈ నెల 7న భారత వాస్తవాధీన పరిధిలోకి చొచ్చుకు వస్తున్న చైనా సైనికులను.. భారత సైన్యం అడ్డగించడంతో చైనా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. అయితే ఈ విషయాన్ని కూడా చైనా మీడియా బుకాయించింది. భారత సేనలే కాల్పులు జరిపాయని ఆరోపించింది. అయితే ఈ ఏడాది మే నుంచే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చైనా సైన్యం సృష్టించిన దమనకాండలో సుమారు 20 మంది మన సైనికులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సఖ్యత లోపించింది.

చైనా కంపెనీలకు చెందిన పలు యాప్​లను భారత్​ నిషేధించింది. దీంతో ఆ దేశం మరింత రెచ్చిపోతోంది. అయితే కొంతకాలంగా దౌత్య చర్చలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంది. అయితే తాజాగా చెలరేగిన కాల్పుల కలకలంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. మాస్కోలో జరుగుతున్న ‘శాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సమ్మేళనంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ అక్కడికి వెళ్లారు. ఆయన మాస్కోలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చలు గనుక విఫలమైతే ఇక యుద్ధం తప్పదని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.

యుద్ధమా అదంతా నాటకం!
అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఉత్పత్తుల పునరుద్ధరణ, యాప్​ల నిషేధం ఎత్తివేత కోసం చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వర్గం మీడియా అభిప్రాయపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ యుద్ధాలు జరుగకపోవచ్చని..ఒకవేళ జరిగితే స్వల్ప యుద్ధం జరుగవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాలు తలపడితే.. ఇరు దేశాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూస్తాయని అందువల్ల ఆ పనికి ఇరుదేశాలు ఉపక్రమించవని పలువురు నిపుణులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News