అమెరిక‌న్ల‌కు మ‌నోళ్లు ఇన్ని ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చార‌ట‌

Update: 2017-11-16 03:47 GMT
ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది మొద‌లు అమెరికన్ల నిరుద్యోగానికి పొరుగు దేశాల ఉద్యోగులే కారణమంటూ గ‌గ్గోలు పెట్ట‌డ‌మే కాకుండా దేశాధ్యక్ష ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది తెలిసిందే. అయితే భారతీయ కంపెనీలు అగ్రరాజ్యంలో లక్షా 13 వేలకుపైగానే ఉద్యోగాలను సృష్టించాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాక దాదాపు 18 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో రూ.1,17,000 కోట్లు) పెట్టుబడులను పెట్టాయని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నివేదిక తెలిపింది. ‘అమెరికా మట్టిలో భారతీయ వేర్లు’ శీర్షికన ఓ వార్షిక నివేదికను సీఐఐ ఇక్కడ విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత సంస్థలు బలాన్నిస్తున్నాయే తప్ప, బలహీనపర్చడం లేదని రుజువైంది. అమెరికా వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న 100 భారతీయ సంస్థలు 1,13,423 మందికి ఉద్యోగాలను కల్పించాయని, 17.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని సీఐఐ తెలియజేసింది. కాగా, మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో సగటున 187 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇండియన్‌ కంపెనీలు పెట్టగా, ఈ 100 సంస్థల్లో రాబోయే ఐదేళ్ల‌లో మరింతగా స్థానికులకు ఉద్యోగాలను కల్పించే దిశగా 87 సంస్థలు ముందుకెళ్తుండటం గమనార్హం.

ఇక కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా 147 మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చాయని, 588 మిలియన్‌ డాలర్లను అమెరికా పరిశోధనాభివృద్ధి ఖర్చుల కోసం అందించాయని తేలింది. భారతీయ సంస్థల వ్యాపారం అమెరికాకే మేలని అక్కడి సెనెటర్లు, కాంగ్రెస్‌మెన్లూ అంటున్నారు. ‘అమెరికాలో జోరుగా పెట్టుబడులను పెంచుకుంటూపోతూ, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ఉద్యోగాల కల్పనకు కారణమవుతున్న విదేశీ సంస్థల్లో భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి’ అని సెనెటర్‌ క్రిస్‌ వాన్‌ హోలెన్‌ చెప్పారు. ‘ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా-భారత్‌ల బలమైన భాగస్వామ్యం.. ఈ 21వ శతాబ్ద మనుగడకే కీలకం’ అని కాంగ్రెస్‌మెన్‌ అమీ బేరా అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌ హయాంలో అమెరికా-భారత్‌ మైత్రి మరింత బలపడగలదని మరో కాంగ్రెస్‌మెన్‌ పీట్‌ సెషన్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతీయ కంపెనీలు అమెరికాలోకి వందల మిలియన్ల డాలర్లను తెస్తున్నాయి. ఇక్కడివారికి వేల ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా సంస్థలకు అత్యుత్తమ అవకాశాలను తమ సంస్కరణల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కల్పిస్తున్నారు’ అని సెషన్స్‌ కొనియాడారు. ‘ఉత్తర కరోలినాలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగడానికి భారతీయ పెట్టుబడులు కలిసొస్తున్నాయి’ అని కాంగ్రెస్‌మెన్‌ జార్జ్‌ హోల్డింగ్‌ అన్నారు. మొత్తానికి అమెరికా సంపదను దోచేసుకుంటున్నాయంటూ వీలుచిక్కినప్పుడల్లా విదేశీ సంస్థలపై, ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలపై ఎగిరెగిరి పడుతున్న ట్రంప్‌కు తాజా నివేదిక ఓ మేలుకొలుపు కావాలని ఆశిద్దాం.

భారతీయ కంపెనీలు అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన టాప్‌-5 అమెరికా సంయుక్త రాష్ట్రాలు
న్యూజెర్సీ (8,572) - టెక్సాస్‌ (7,271) - క్యాలిఫోర్నియా (6,749) - న్యూయార్క్‌ (5,135) - జార్జియా (4,554).

భారతీయ సంస్థలు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెట్టిన రాష్ట్రాలు
న్యూయార్క్‌ (1.57 బిలియన్‌ డాలర్లు) - న్యూజెర్సీ (1.56 బిలియన్‌ డాలర్లు) - మస్సాచుసెట్స్‌ (931 మిలియన్‌ డాలర్లు) - క్యాలిఫోర్నియా (542 మిలియన్‌ డాలర్లు) - వ్యోమింగ్‌ (435 మిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.
Tags:    

Similar News