భారత్ ఆటగాళ్లకు ఆ దేశంలోకి నో ఎంట్రీ

Update: 2020-03-04 04:49 GMT

స్నేహపూర్వకం మ్యాచ్ ఆడేందుకు భారత క్రీడాకారులు సిద్ధమైన వేళ.. వారిని తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు నో చెప్పేసిందో దేశం. ఎందుకిలా? అంటే.. అందుకు కారణంగా గడిచిన రెండు రోజులుగా భారత్ లోని పలు ప్రాంతాల్లో కొవిడ్ -19 వైరస్ కేసులు విస్తరిస్తుండటమేనని చెప్పాలి. ఇంతకీ భారత ఆటగాళ్లను తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వమన్న నిర్ణయం తీసుకున్న దేశమేదన్నది చూస్తే..

భారత అండర్ -16 ఫుట్ బాల్ జట్టు తజికిస్తాన్ లో పర్యటించాల్సి ఉంది. ఏఎఫ్ సీ అండర్ -16 చాంపియన్ షిప్ రన్నరప్ అయిన తజికిస్తాన్ తో రెండు ఫ్రెండ్లీ మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే.. భారత్ లో ఇటీవల కొవిడ్ వైరస్ కేసులు వరుస పెట్టి నమోదవుతున్న వేళ.. భారత ఆటగాళ్లు తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

కొవిడ్ వైరస్ ప్రభావం ఉన్న 35 దేశాలకు చెందిన వారిని తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తజికిస్తాన్ నో చెప్పేసింది. ఆ దేశంలో తమను అనుమతించని కారణంగా ఆ దేశ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ లు ఆడలేకపోతున్నట్లుగా భారత పుట్ బాల్ సమాఖ్య స్పష్టం చేసింది. నిజానికి ఈ ఒక్క ఉదంతమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా లోకానికి సంబంధించి కొత్త అనుభవాలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.

కొవిడ్ కారణంగా అమెరికాలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఆ దేశ జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తమ దేశ ఆటగాళ్లు.. జట్ల కోచ్ లు.. ఫిజియోలతో పాటు ఇతర సిబ్బందికి కొత్త నిబందనల్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇకపై కొంతకాలం పాటు ఆటగాళ్లు ఎవరూ తమ అభిమానుల్ని కలవకూడదని.. ఆటోగ్రాఫ్ లు చేసేందుకు.. పెన్నులు ముట్టుకోవటంతో పాటు.. సెల్ఫీలకు సైతం దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఇవే కాదు.. మరికొన్ని దేశాల్లోనూ చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. శ్రీలంకలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు ఆ దేశంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ స్పష్టం చేస్తున్నారు. తమ దేశ క్రికెట్ బోర్డు కొత్తగా (కొవిడ్ వైరస్ నేపథ్యంలో) తీసుకొచ్చిన మార్గదర్శకాల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతామని చెబుతున్నారు.

Tags:    

Similar News