అవ‌మానం చాలు.. ఇక ఆగ్ర‌హ‌మే అంటున్న బీజేపీ ఎమ్మెల్యే!

Update: 2022-04-14 11:32 GMT
అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఆధిప‌త్య పోరు.. విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. ఇదీ ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప‌రిస్థితి. ఇటీవ‌ల రాహుల్ గాంధీతో స‌మావేశం త‌ర్వాత పార్టీ నాయ‌కుల్లో మార్పు వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటోంది. బ‌లోపేతం దిశ‌గా దృష్టి సారించింది. కేసీఆర్ కూడా ఆ పార్టీనే టార్గెట్ చేయ‌డం క‌షాయ ద‌ళానికి క‌లిసొచ్చింది. కానీ అంతా బాగానే ఉంది క‌దా అని అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే బీజేపీలోనూ అంత‌ర్గ‌త పోరు ముమ్మ‌రంగా సాగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌నే టాక్ వినిపిస్తోంది.

సంజ‌య్‌పై అసంతృప్తి..ఇప్ప‌టివ‌ర‌కూ అవమానించింది చాలు.. ఇక భ‌రించే ప‌రిస్థితే లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వైఖ‌రిపై ర‌ఘునంద‌న్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

పార్టీ కార్యక్రమాల వేదికలపై ప్రొటోకాల్‌ పాటించట్లేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైర్ అవ‌డం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. బండి సంజయ్ ప‌ద్ధ‌తిని తప్పుబడుతూ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులుకు రఘునందన్‌ తన అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కార‌ని తెలిసింది. రోజూ అవమానిస్తుంటే భరించాలా? పార్టీ ప్రొటోకాల్‌ పాటించకపోతే కుదరదని రఘునందన్ తేల్చిచెప్పినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సంఘ‌ట‌నలు..రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆహ్వానించినా తనను వేదికపైకి పిలవకపోవడంతో ర‌ఘ‌నంద‌న్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యార‌ని టాక్‌. అంతే కాకుండా కొంత కాలంగా పలు సందర్భాల్లో బండి తీరు అవమానించేలా ఉందని ఆయ‌న త‌న అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలిసింది. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్రను చార్మినార్‌ వద్ద ప్రారంభించినప్పుడు, ముగింపు సభ సిద్దిపేట జిల్లాలోనే జరిగినప్పుడూ త‌న‌కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం అవ‌మానించ‌డ‌మేన‌ని ర‌ఘునంద‌న్ మండిప‌డుతున్నారు.

రాష్ట్రంలో ఉన్న ముగ్గ‌రు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ ఛుగ్‌ చెప్పినా సంజయ్ దానిని అమలు చేయ‌లేద‌ని ఆరోపించారు. జీహెచ్ఎంసీతో పాటు క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో బీజేపీ ఫ్లోర్‌లీడ‌ర్ల ఎంపిక విష‌యంలోనూ సంజ‌య్ ధోర‌ణిపై ర‌ఘునంద‌న్ విమ‌ర్శ‌లు చేసిన‌ట్లు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఇక త‌గ్గేదే లేద‌ని ఆయ‌న డిసైడ‌య్యార‌ని స‌మాచారం. మ‌రి రాష్ట్రంలో పుంజుకునేందుకు మంచి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పార్టీలో నేత‌ల మ‌ధ్య ఈ విభేదాలు న‌ష్టం చేకూర్చే ప్ర‌మాదం ఉంది. అందుకే అధిష్ఠానం చొర‌వ తీసుకుని స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని పార్టీ వ‌ర్గాలు కోరుతున్నాయి.
Tags:    

Similar News