చ‌ల్లార‌ని ఇంట‌ర్‌ వివాదం!.. బ్యాక్ డోర్‌ లో అధికారులు!

Update: 2019-04-26 14:19 GMT
తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ముందు ఆందోళ‌న‌లు కంటిన్యూ అవుతున్నాయి. బోర్డు అధికారుల నిర్ల‌క్ష్య  ధోరణి కారణంగా పాసైన వాళ్లు ఫెయిల‌యి పోతూ ఉంటే... ఫెయిలైన వారికి ఏకంగా 90కి పైగా మార్కులు వ‌చ్చేసిన వైనంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. పరీక్ష‌లు బాగానే రాశామ‌ని - త‌ప్ప‌కుండా పాస్ అవుతామ‌ని భావించిన విద్యార్థులు రిజ‌ల్ట్స్ లో తాము ఫెయిలైన‌ట్టు తేల‌గానే... తీవ్ర మ‌నోవేద‌న‌కు లోనై ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ జాబితాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మ‌శ్ మేన‌ల్లుడు ధ‌ర్మారామ్ కూడా ఉన్నాడు. వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకంటూ మీడియా ముందుకు వ‌చ్చిన బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్‌... పొర‌పాట్లు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించ‌డంతో అస‌లు ర‌చ్చ మొద‌లైంది.

వేలాదిగా విద్యార్థులు - వారి త‌ల్లిదండ్రులు బోర్డు కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. ఈ ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెరిగిపోయాయి. విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జా సంఘాలు - రాజ‌కీయ పార్టీలు కూడా రంగంలోకి దిగిపోవ‌డంతో ఇంట‌ర్ బోర్డు వివాదం పెద్ద‌దిగానే మారిపోయింది. స్వ‌యంగా త‌ప్పు చేశామ‌ని ఇంట‌ర్ బోర్డు ఒప్పుకుంటూ ఉంటే... వారిపై చ‌ర్య‌లు తీసుకోరా? అంటూ కేసీఆర్ స‌ర్కారుపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే ఐదు రోజుల త‌ర్వాత ఈ విష‌యంపై దృష్టి సారించిన కేసీఆర్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే య‌త్నం చేశారు. రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యుయేష‌న్ కూడా ఉచితంగానే చేయిస్తామ‌ని - విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోరాద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఇంట‌ర్ బోర్డు వివాదం స‌మ‌సిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపించింది.

అయితే కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేసి రెండు రోజులు అవుతున్నా... ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద ఆందోళ‌న‌లు ఎంత‌మాత్రం త‌గ్గ లేదు. శుక్ర‌వారం కూడా వ‌రుస‌గా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. సీపీఎం కార్యక‌ర్త‌లు విద్యార్థులకు మ‌ద్ద‌తుగా బోర్డు కార్యాల‌యాన్ని ముట్ట‌డించే య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇదిలా ఉంటే... రోజుల త‌ర‌బ‌డి బోర్డు కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌లు జ‌రుగుతుంటే... వివాదానికి కేంద్ర బిందువుగా మారిన బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ మాత్రం ఎంచ‌క్కా త‌న కార్యాల‌యానికి వ‌స్తూ పోతూ ఉన్నారు. ఈ వివాదంలో త‌న త‌ప్పేమీ లేద‌న్న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్న అశోక్‌... రోజూ య‌ధావిధిగానే ఆఫీస్ కు వ‌చ్చిపోతున్నారు.

అయితే బోర్డు కార్యాల‌యం ముందు నాన్ స్టాప్ గా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌ల దెబ్బ‌కు భ‌య‌ప‌డిన ఆయ‌న కార్యాల‌యానికి రావ‌డానికి - కార్యాల‌యం నుంచి ఇంటికి వెళ్ల‌డానికి బ్యాక్ డోర్ నే ఎంచుకున్నారు. బోర్డు కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌లు జ‌రుగుతుంటే... అశోక్ మాత్రం కార్యాల‌యానికి ఇంకో మార్గాన ఉన్న ద్వారం ద్వారా కార్యాల‌యానికి వ‌చ్చి వెళుతున్నారు. కారును కూడా బోర్డు కార్యాల‌య ప్రాంగ‌ణంలో కాకుండా అల్లంత దూరంలో ఉన్న వేరే భ‌వ‌నం ప్రాంగ‌ణంలో ఆపి... అక్కడి నుంచి దొడ్డిదారిన కాలి న‌డ‌క‌న కార్యాల‌యానికి వ‌స్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్ గా మారిపోయాయి.


Tags:    

Similar News