భైంసాలో కర్ఫ్యూనే కాదు.. ఇంటర్నెట్ కట్ కూడా

Update: 2020-01-14 06:12 GMT
టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు లేవు. లైవ్ రిపోర్టింగ్ లేదు. అదే పనిగా చూపించిందే చూపిస్తూ.. చిలువలు పలవులుగా అల్లేస్తూ.. ఎమోషన్స్ ను తారాస్థాయికి తీసుకెళ్లే అంశాల్లేవు. చివరకు డిబేట్లు కూడా లేవు. అందుకేనేమో? నిర్మల్ జిల్లాలోని భైంసా అట్టుడికిపోయినా.. పేపర్లను కొన్ని వెబ్ సైట్లు మినహాయించి అక్కడేం జరిగింది? ఇప్పుడేం జరుగుతుందన్న అంశంపై ఎవరిక పెద్దగా అవగాహన లేకపోగా.. ఇప్పుడా పట్టణంలో కర్ఫ్యూ విధించిన వైనం విన్నంతనే విస్మయానికి గురి చేస్తోంది.

ఆదివారం సాయంత్రం మొదలైన అల్లర్లు రాత్రి వరకూ సాగి.. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగి పెద్దవి కావటమే కాదు.. అర్థరాత్రి దాటిన తర్వాత కానీ ఒక కొలిక్కి రాలేదు. అంతేనా? సోమవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్నట్లే ఉన్నా.. వదంతుల కారణంగా సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఉద్రిక్తతు మరింత పెరిగాయి. దీంతో.. వాతావరణాన్ని మరింత అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూను విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన పోలీసులు.. భైంసా పట్టణమంతా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకూ అసలు వివాదం ఎక్కడ మొదలైంది? అన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. భైంసా పట్టణంలోని కోర్బగల్లి ప్రాంతంలో టూవీలర్ ను వేగంగా దూసుకెళ్లటం.. సైలెన్సర్ తీసేసి పెద్ద శబ్దంతో వెళ్లిన ఉదంతం చిలికి చిలికి గాలివానలా మారిందని చెబుతున్నారు.

ఈ అల్లర్లకు ఇళ్ల ముందు నిలిచి ఉంచిన కారు.. ఆటోతో పాటు బైకులకు అల్లరిమూకలు తగలపెట్టటంతో వాతావరణం ఒక్కసారి మారిపోయి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో గొడవల్ని తగ్గించేందుకు రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులకే కాదు.. పోలీసు సిబ్బంది కూడా గాయాల పాలయ్యారు. ఇరువర్గాలు రాళ్లు విసిరేసుకున్న సమయంలో పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి మరింతగా అదుపు తెచ్చేందుకు.. వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. భైంసా ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళలో అతి సున్నితమైన భైంసా పట్టణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడినట్లు తెలుస్తోంది. ఘర్షణలు జరుగుతుంటే.. సకాలంలో ఎందుకు స్పందించలేదు? అని సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం.
Tags:    

Similar News