ఐపీఎల్ 2021 :టీకా వద్దనుకున్నారు , కథ అడ్డం తిరిగింది !

Update: 2021-05-15 08:31 GMT
ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. అయితే , కరోనా కారణంగా 2021 ఐపీఎల్ మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. భారత్‌ లో కరోనా  పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఈఏకి మార్చిన బీసీసీఐ , ఐపీఎల్‌-2020ను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ, 14వ సీజన్‌కు వచ్చే సరికి సీన్‌ మారింది. ఈసారి స్వదేశంలోనే  ఐపీఎల్ ను  నిర్వహించారు. కానీ, బయో బబుల్‌ లో ఉన్నా ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021కు మధ్యలోనే బ్రేక్‌ పడింది. 31 మ్యాచ్‌ లు మిగిలి ఉండగానే టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు.

అయితే, విదేశాల్లో మిగతా షెడ్యూల్‌ పూర్తి చేద్దామనుకున్నప్పటికీ అది కుదిరే పని అయితే కాదు. ముఖ్యంగా సన్‌ రైజర్స్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాకు మరోసారి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ కావడం, కేకేఆర్‌ క్రికెటర్‌ ప్రసిద్‌ కృష్ణ ఇంకా హోంక్వారంటైన్‌ లోనే ఉండాల్సి రావడం సహా విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు  వెళ్లిపోవడంతో ఇక ఈ ఏడాది ఐపీఎల్ కష్టమే అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయిద్దామని ఫ్రాంఛైజీలు భావించినా, పలువురు క్రికెటర్లు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. బయో బబుల్‌ లో సురక్షితంగా ఉన్నాం కదా. వ్యాక్సిన్‌తో పనేంటి అనుకున్నారు. దీంతో, ఫ్రాంఛైజీలు కూడా వారిని మరీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు.

ఫలితంగా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చార్టర్‌ ఫ్లైట్లలో ప్రయాణాలు చేసినప్పటికీ ఇతర సిబ్బంది కూడా మాతోనే ఉంటారు కదా. వారి కోవిడ్‌ స్టేటస్‌ ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు ఎవరికి ఎప్పుడు వైరస్‌ సోకిందో చెప్పడం కష్టం అని కొందరు చెప్పినట్టు ఓ ప్రముఖ పత్రిక ప్రచురితం చేసింది. అయితే, విదేశీ క్రికెటర్లు, సిబ్బంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపినా, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వారికి వ్యాక్సినేషన్‌ చేయలేకపోయామని తెలిపినట్లు వెల్లడించింది.కాగా సాహా, ప్రసిద్‌ కృష్ణ మే 25న ముంబైలో నిర్వహించే మూడు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్‌ వస్తే మాత్రమే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వారికి చాన్స్‌ ఉంటుంది. లేదంటే మేజర్‌ టోర్నీపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది
Tags:    

Similar News