టీమిండియా క్రికెటర్ కు ఐర్లాండ్ ఆఫర్.. అతడేం చేశాడంటే..?

Update: 2022-12-13 00:30 GMT
క్రీడల్లో ఒక దేశంలో పుట్టిన ఆటగాళ్లు మరో దేశం తరఫున ఆడడం సహజమే. ఒకప్పుడంటే ఏమో కాని.. గత 20 ఏళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. 'వేరొక దేశానికి ప్రాతినిధ్యం' అనే విషయం చాలా సాధారణమైపోయింది. క్రికెటర్లు అవకాశాలు రాని వేళ.. ఫుట్ బాలర్లు మెరుగైన అవకాశాల కోసం.. ఇతర క్రీడల్లోని వారు వసతులు వెదుక్కుంటూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. 35 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికా క్రికెటర్ కెప్లెర్ వెస్సెల్స్ ఆస్ట్రేలియాకు ఆడాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా జాతి వివక్ష కారణంగా 21 ఏళ్ల నిషేధంలో ఉంది. ఆ నిషేధం ముగిశాక వెస్సెల్స్ దక్షిణాఫ్రికాకు తిరిగి రావడమే కాక కెప్టెన్ గానూ విజయవంతంగా నడిపించాడు.

మొన్నటికి మొన్న ఇగ్లండ్ కు 2019 ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ క్రికెటర్. సొంత దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ లూ ఆడాడు. తదనంతరం ఇంగ్లండ్ కు వెళ్లి ఆ దేశ కెప్టెన్ కావడమే కాక ప్రపంచ కప్ సాధించి పెట్టి చరిత్రలో నిలిచిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ కు ఆడాడు. బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ లో జన్మించి ఇంగ్లండ్ కు ఆడుతున్నాడు. నయా బ్యాటింగ్ సంచలనం మార్నస్ లబుషేన్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫుట్ బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్ లో ఇలాంటి వారి జాబితా కోకొల్లలు.

భారత్ లో అరుదే.. భారత్ లో పుట్టి ఇతర దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు తక్కువే. కాకపోతే మన దేశానికి చెంది.. శతాబ్దాల కిందట వలస వెళ్లిన వారు ఆయా దేశాలకు జాతీయ స్థాయి ఆటగాళ్లుగా మారిన ఉదంతాలున్నాయి. శివనారాయణ్ చందరపాల్ (వెస్టిండీస్), కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా), నాసిర్ హొస్సేన్ (ఇంగ్లండ్) వీరంతా ఆయా జట్లకు క్రికెట్ లో కెప్టెన్లుగా వ్యవహరించిన భారత సంతతి ఆటగాళ్లు. సహజంగానే మన దేశం పెదద్ది కావడం, అవకాశాలు ఎక్కువ శాతం ఉండడంతో ఇతర దేశాలకు వెళ్లడం తక్కువేనని భావించాలి.

ఆ క్రికెటర్ కు భలే ఆఫర్, కానీ టీమిండియాలో యువ క్రికెటర్ సంజూ శాంసన్ ది విచిత్ర పరిస్థితి. కేరళకు చెందిన సంజూ ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ కావడంతో పాటు వికెట్ కీపర్ కూడా. అయితే, అతడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీనికి జట్టులో పోటీనే కారణం. అయితే, సంజూ అభిమానుల వాదన వేరేలా ఉంది. అతడిని తొక్కేస్తున్నారని వారు భావిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల పెద్దఎత్తున దుమారం సైతం రేగింది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌ బోర్డు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని మ్యాచుల్లో ఆడిస్తాన్న ఒప్పందంపై అతడిని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఐర్లాండ్‌ ఆఫర్‌ను సంజూ తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇక సంజూ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఏడేళ్లలో 27 మ్యాచుల్లోనే ఆడాడు. వీటిలోనూ ఈ ఏడాది ఆడినవే ఎక్కువ. దీంతోపాటు ఇటీవల జరిగిన ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, తాజాగా బంగ్లాదేశ్‌ టూర్‌కు కూడా సంజూ ఎంపిక కాలేదు. న్యూజిలాండ్ లో మాత్రం ఆడాడు.

ప్రతిభావంతుడే కానీ 28ఏళ్ల సంజూ ప్రతిభావంతుడేననడంలో సందేహం లేదు. కానీ, అవకాశాలు వచ్చినప్పుడు అతడు ఉపయోగించుకోలేదు. వరుసగా విఫలం కాకున్నా.. మ్యాచ్ లు గెలిపించే స్థాయిలో ఇన్నింగ్స్ లు లేవు. దీనికితోడు రిషభ్ పంత్ , ఇషాన్ కిషన్ రూపంలో గట్టి పోటీ ఉంది. మొన్నటి మ్యాచ్ లో ఇషాన్ డబుల్ సెంచరీ ప్రదర్శనను అందరూ చూశారు. అయితే, సెలక్టర్ల దృష్టిలో సంజూ ఎందుకు పడటం లేదంటూ అభిమానులు వ్యక్తం చేసే ఆవేదనలో అర్ధం ఉన్నప్పటికీ.. అది పూర్తిగా సరైనదేనని చెప్పలేం. అయితే, ఇకపై అన్ని మ్యాచుల్లో అవకాశం కల్పిస్తామన్న నిబంధనతో ఐర్లాండ్‌ జట్టు.. తమ తరఫున ఆడాలని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను భారత్‌ తరఫునే ఆడతానని, అవకాశం ఇచ్చినంత వరకు వేచి చూస్తానని సంజూ సమాధానం చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఈ విషయంలో సంజూ నిబద్ధతను కాదనలేం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News