బ్రిటిష్ పౌరుడిని పెళ్లి చేసుకోనున్న ష‌ర్మిల‌

Update: 2017-05-06 07:04 GMT

మానవ హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల త్వరలో పెళ్లి కూతురు కానున్నారు. తన స్నేహితుడు, గోవా మూలాలున్న బ్రిటిష్ పౌరుడు డెస్మాండ్ కుటినోను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డెస్మాండ్ మీడియాకు వెల్లడించారు. చట్టప్రకారమైన అనుమతులు రాగానే మేము తమిళనాడులో వివాహం చేసుకోబోతున్నాం అని ఆయన అన్నారు. వివాహ తంతు నిర్వహణకు సంబంధించి ఇటీవల వీరిద్దరు మదురైని సందర్శించారు. తేదీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. 2011లో తొలిసారి వీరు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావాలని చూస్తున్నారు.

మణిపూర్‌ లో ప్రత్యేక సైనికాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన షర్మిల ఇక చట్టసభల్లో పోరాడుతానని ప్రకటించి గత ఏడాది ఆగస్టులో దీక్షను విరమించారు. అనంత‌రం వ‌చ్చి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక తాను దక్షిణభారత దేశానికి వెళ్లి ప్రశాంత జీవనం గడపాలని కోరుకుంటున్నట్టు మీడియాతో పేర్కొన్న ష‌ర్మిల‌ ఇప్పుడు తన వివాహంతో వార్తల్లో నిలిచారు. షర్మిల పెళ్లి నిర్ణయాన్ని ఆమె సోదరుడు సింఘాజిత్ స్వాగతించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News