ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మేనా.. ఆ మంత్రి ట్వీట్ ప‌ర‌మార్థం అదేనా?

Update: 2022-09-24 04:59 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయి అనే ఇటీవ‌ల జ‌న‌సేన‌, టీడీపీ త‌దిత‌ర పార్టీలు త‌మ పార్టీ స‌మావేశాల్లో నేత‌ల‌కు చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించి తమ పార్టీ నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చారు కూడా. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై ఇప్పుడ‌యితే ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ ఉంద‌ని.. దీన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుంటే 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన‌న్ని సీట్లు వ‌స్తాయ‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా అంచ‌నాలు వేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

వాస్త‌వానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌లు 2024 ఏప్రిల్‌/  మే మాసాల్లో జ‌ర‌గాల్సి ఉంది. అంటే ఎంత లేద‌నుకున్నా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. అయితే గ‌తంలో తెలంగాణ‌లో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి సానుకూల ఫ‌లితాలు పొందిన‌ట్టు వైఎస్ జ‌గ‌న్ సైతం అదేప‌ని చేయాల‌నుకున్నారు. పంచాయ‌తీ, మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్‌, మున్సిపాలిటీ, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా అక్క‌డా ఇదే ప్ర‌భంజనాన్ని సృష్టించి అధికారంలోకి రావాల‌ని త‌ల‌చింద‌ని అంటున్నారు.

తాజాగా ఏపీ జ‌ల‌వ‌నరుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన ఒక ట్వీట్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇచ్చిన సంకేత‌మేన‌ని అంటున్నారు. వైఎస్ జ‌గ‌న్ వైఎస్సార్ చేయూత మూడో విడ‌త నిధుల‌ను జ‌మ చేయ‌డానికి చిత్తూరు జిల్లా కుప్పంలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. కుప్పం నుంచి టీడీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ట్వీట్ చేసిన అంబ‌టి రాంబాబు.. కుప్పం మే కూలిపోతుంది అని ఒకే ఒక వాక్యంలో పేర్కొన్నారు. అయితే అంబ‌టి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏ విష‌యమూ పేర్కొన‌క‌పోయినా కుప్పం మే కూలిపోతుంది అని పేర్కొన‌డంతో.. వ‌చ్చే మేలోనే ముంద‌స్తు ఎన్నిక‌లు ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే అంబ‌టి ఇలా త‌న ట్వీట్ ద్వారా సంకేత‌మిచ్చార‌ని అంటున్నారు.

వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వివిధ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బు పంచ‌డం మిన‌హా ఏపీలో ఏ అభివృద్ధీ లేదని అంటున్నారు. ఏపీ రాజ‌ధాని ఏంట‌ని త‌న కుమార్తెను ఢిల్లీలో ఆమె స‌హ‌చ‌ర విద్యార్థినులు ఆట‌ప‌ట్టిస్తున్నార‌ని సాక్షాత్తూ హైకోర్టు న్యాయ‌మూర్తి ఒకరు ఇటీవ‌ల తీవ్ర ఆవేదన వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఓవైపు ప‌థ‌కాలు అందిస్తున్నా చెత్త ప‌న్నులు, క‌రెంటు, బ‌స్సు చార్జీల పెంపు, మద్యం ధ‌ర‌ల పెంపు, ఎన్నో ద‌శాబ్దాల క్రితం నిర్మించుకున్న ఇళ్ల‌కు ఓటీఎస్ (వ‌న్ టైమ్ సెటిల్ మెంట్) అంటూ రూ.10 వేల‌కుపైగానే క‌ట్టించుకోవ‌డం వంటివాటి ద్వారా ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంటోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వీట‌న్నింటికీ మించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌తో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొంటున్నారు. మ‌రోవైపు టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తే జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌నే చ‌ర్చ సాక్షాత్తూ ప్ర‌జ‌ల్లోనే జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌తిరేక‌త ఇంకా పెర‌గ‌క‌ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి కేసీఆర్ లా ల‌బ్ధి పొందాల‌నేది జ‌గ‌న్ ప్లాన్ అని చెబుతున్నారు. ఈ కోవ‌లోనే అంబ‌టి రాంబాబు ట్వీట్ కూడా ఉంద‌ని ఢంకా బజాయిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News