వైఎస్ఆర్ విష‌యంలో కాంగ్రెస్ త‌ప్పు చేస్తోందా?

Update: 2021-09-03 07:30 GMT
దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు.  2009లో ఆయ‌న మ‌ర‌ణించిన వేళ అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీ ప్ర‌జ‌లంతా క‌న్నీళ్లు పెట్టుకున్నార‌నే మాట ఇప్ప‌టికీ వినిపిస్తోంది. ఆయ‌న చ‌నిపోయి 12 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ చాలా మంది ప్ర‌జ‌ల ఇళ్ల‌లో ఆయ‌న ఫోటోలు క‌నిపిస్తాయి. ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి.. వ‌రుస‌గా  రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌ది. కానీ అలాంటి గొప్ప నాయ‌కుడి విష‌యంలో ప్ర‌స్తుతం కాంగ్రెస్ త‌ప్పు చేస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉమ్మ‌డి ఏపీలో పాద‌యాత్ర చేపట్టి 2004లో తొలిసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్సార్ అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే పాటుప‌డ్డారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, 108 అంబులెన్స్ సేవ‌లు.. ఇలా ఎన్నో గొప్ప ప‌థకాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో 2009లోనూ అధికారాన్ని నిల‌బెట్టుకోగ‌లిగారు. కానీ అదే ఏడాది హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. కాంగ్రెస్ నాయ‌కుడిగా ఎదిగిన ఆయ‌న‌.. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగానే తుదిశ్వాస విడిచారు. కానీ అలాంటి నాయ‌కుడిని ఇప్పుడు కాంగ్రెస్ త‌మ‌వాడ‌ని చాటుకోలేక‌పోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కుడే అని బ‌లంగా చెప్పుకోలేక‌పోతుంది. ఆయ‌న విష‌యాన్ని మ‌రిచి విమ‌ర్శ‌లు పాల‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పత్తాలేకుండా పోయింది. ఇక తెలంగాణ‌లోనే కాస్తో కూస్తో ప్ర‌భావం చూప‌గ‌లుగుతున్న ఆ పార్టీ వైఎస్సార్ పేరును వాడుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంద‌నే మాటలు వినిపిస్తున్నాయి.

అటు ఏపీలో వైసీపీ పార్టీ స్థాపించి తండ్రి బాట‌లో న‌డుస్తున్న జ‌గ‌న్‌.. ఆయ‌న పేరు పెట్టుకునే ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇటు తెలంగాణ‌లో త‌న నాన్న పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీళ్లు వైఎస్సార్ వార‌సులు అన‌డంలో త‌ప్పు లేదు. కానీ రాజ‌కీయంగా చూస్తే వైఎస్సార్ ఓ వ్య‌క్తి కాదు.. కాంగ్రెస్  నాయ‌కుడు. అలాంటిది ఆయ‌న వారసులే ఆయ‌న పేరును వాడుకుంటూ రాజ‌కీయాలు చేయ‌గా లేనిది మ‌రి కాంగ్రెస్ పార్టీ అలా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. వైఎస్సార్ ప్ర‌త్యేకంగా ఓ పార్టీ పెట్టి ఉంటే.. ఆయ‌న మ‌రాణానంతరం జ‌గ‌న్ కానీ ష‌ర్మిల కానీ ఆ పార్టీని న‌డిపిస్తుంటే రాజ‌కీయ వార‌సులిగా చెప్పుకోవ‌డానికి స‌రైన కార‌ణం ఉండేది. కానీ కాంగ్రెస్‌లో ఉంటూ మ‌హానేత‌గా ఎదిగిన వైఎస్సార్ ఎప్ప‌టికీ కాంగ్రెస్ నాయ‌కుడే అన‌డంలో సందేహం లేదు. ఆయ‌న మ‌ర‌ణించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆయ‌న‌ను అభిమానించే ప్ర‌జ‌లు వైఎస్ఆర్‌ను కాంగ్రెస్ నాయ‌కుడిగానే చూస్తారు.

కానీ తెలంగాణ‌లో కాంగ్రెస్ మాత్రం ఆయ‌న పేరుకు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న పేరుకు ఉన్న ప‌వ‌ర్‌ను వాడుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ ఎంపికైన త‌ర్వాత పార్టీలో ఉన్న వైఎస్ మ‌నుషుల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. వైఎస్ 12వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణ విజ‌య‌మ్మ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నానికి ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని రాష్ట్ర కాంగ్రెస్ హుకూం జారీ చేయ‌డం వెన‌క రేవంత్ ఉన్నార‌ని రాజ‌కీయ నిపుణులు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీని ప్ర‌ధాని చేయ‌డ‌మే వైఎస్ ల‌క్ష్యంగా ఉండేద‌ని.. ఆ దిశ‌గా తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పిన రేవంత్‌.. వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు మాత్రం పార్టీ నాయ‌కులు వెళ్లేది లేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  తెలంగాణ వ్య‌తిరేకి అంటూ వైఎస్ఆర్‌పై విమర్శ‌లు ఉండ‌టంతోనే ఆ ప్ర‌భావం పార్టీపై ప‌డ‌కుండా ఉండేందుకే  ఇలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.  కానీ ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై ఉన్న అభిమానం ముందు ఆ ముద్ర చాలా చిన్న‌ద‌నే విష‌యాన్ని కాంగ్రెస్ గ్ర‌హించి ఆయ‌న పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని రాజ‌కీయ నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News