వ్యాక్సినేషన్​ ఇలా సాగితే కష్టమే?

Update: 2021-05-20 06:41 GMT
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ నడుస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్​వేవ్​ లో ఆ స్థాయిలో కేసులు లేవు. మరణాలు లేవు.. ఆస్పత్రిల్లో బెడ్ల కొరత లేదు.. ఆక్సిజన్​ కొరత లేదు. వెరసి ప్రజలు పెద్దగా భయాందోళన చెందలేదు. కానీ సెకండ్​వేవ్​ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఎక్కడో ఓ చోట మాత్రమే మరణాలు సంభవించేవి కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు తెలిసిన వాళ్లే ఎంతో మంది కోవిడ్​ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిరోజు మనం వాట్సాప్​, ఫేస్​బుక్​ లో ఇటువంటి వార్తలే వింటున్నాం.

ఇదిలా ఉంటే కరోనా కట్టడికి ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్​ మాత్రమే. ఈ క్రమంలో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్​ ప్రక్రియను చిత్తశుద్ధితో చేస్తున్నాయా? లేక మొక్కుబడిగా చేస్తున్నాయా? అన్నది చూడాలి. ఈ ఏడాది డిసెంబర్​ నాటికి దేశ వ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం మనదేశంలో వ్యాక్సినేషన్​ ఉత్పత్తి గణనీయంగా జరగడం లేదు.

కేవలం రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్​ ను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ జరగాలంటే 270 కోట్ల వ్యాక్సిన్​ డోసులు కావాలి. ఎందుకంటే వ్యాక్సిన్​ రెండు డోసులు వేయాలి. కానీ ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20 లక్షలు మాత్రమే వ్యాక్సిన్​ డోసులు ఇస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అందరికీ వ్యాక్సినేషన్​ ఇచ్చేసరికి మరో మూడేళ్లు పడుతుందంటున్నారు వైద్య నిపుణులు. ఒకవేళ అదే నిజమైతే ఆలోపు థర్డ్​వేవ్​ కూడా వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్​, అక్టోబర్​లో థర్డ్​వేవ్​ వస్తుందని.. థర్డ్​వేవ్​ లో చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.సెకండ్​వేవ్​ పై శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. యథావిధిగా ఎన్నికలు, మతపరమైన కార్యాక్రమాలు నిర్వహించాయి. దీంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. అయితే దేశంలో కరోనా అదుపులోకి రావాలంటే వ్యాక్సినేషన్​ ఒక్కటే మార్గమని సైంటిస్టులు చెబుతున్నారు.

ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం లేదు. రోజుకు క‌నీసం 90 ల‌క్ష‌ల మంది నుంచి కోటి మందికి వ్యాక్సినేష‌న్ జరిగితే.. డిసెంబ‌ర్ నాటికి దేశంలో రెండు వంద‌ల కోట్ల డోసేజ్ ల వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని నిపుణులు అంచనావేస్తున్నారు. సెకండ్​ వేవ్​ ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్రమోదీ అలసత్వం వహించారని దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. థర్డ్​వేవ్​ వరకైనా ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారేమో వేచి చూడాలి.


Tags:    

Similar News