ఇక జగన్ లక్ష్యం కాపులేనా?

Update: 2022-06-03 05:29 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కదన రంగంలోకి కాలు దువ్వుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్.. గడపకు గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళుతోంది. అలాగే టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజలను చుట్టేస్తోంది. ఇక జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో అన్ని జిల్లాలను కవర్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకోవడానికి వైఎస్ జగన్ గట్టిగా పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం వైఎస్సార్సీపీలో ఆందోళన పెంచుతోందని అంటున్నారు. తమకు ప్రధాన ముప్పు వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం నుంచే ఉంటోందని భయపడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గాన్ని జగన్ లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు చూపుతున్నారు.

ఇందులో భాగంగా జగన్ అధికారంలోకి వస్తూనే కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణాలకు కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఉండగా దీన్ని జగన్‌ ఎత్తేశారని చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం ప్రకటించిన పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని జగన్ అధికారంలోకి రాగానే ఎత్తేశారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కాపుల రిజర్వేషన్‌ అనేది తన చేతుల్లో లేదని.. అది కేంద్రం చేతుల్లోనే ఉందని బాల్‌ను కేంద్రం కోర్టులోకి తోసి తప్పించుకున్నారని గుర్తు చేస్తున్నారు.

ఇక దివంగత నేత వంగవీటి రంగాను దూషించిన వైఎస్సార్సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టి కాపులంటే జగన్‌కు ఎంత చులకన భావముందో నిరూపించారని అంటున్నారు.

అలాగే సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి.. జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్న వీడియోను ఉద్దేశపూర్వకంగానే జగన్‌ ప్రభుత్వం మీడియాకు ఇచ్చిందని చెబుతున్నారు. చిరంజీవిని మాట్లాడటానికి పిలిపించి.. ఆయనతో సీఎం జగన్‌కు దీనంగా ప్రాథేయపడేలా చేశారని విమర్శిస్తున్నారు.

 అంతేకాకుండా చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవిని, సోదరుడు పవన్‌ కల్యాణ్‌ను, ఆయన సతీమణి, పిల్లలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని కూడా సినిమా టికెట్లపై మాట్లాడటానికి జగన్‌ ప్రభుత్వం ఆహ్వానించిందని గుర్తు చేస్తున్నారు. తద్వారా చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవితో సమానంగా పోసాని కృష్ణమురళికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన సరసన పోసానిని జగన్‌ కూర్చోపెట్టారని విశ్లేషకులు నాటి పరిణామాలను వివరిస్తున్నారు. ఇవన్నీ కాపు సామాజికవర్గాన్ని అవమానించడానికి చేసినవేనని అంటున్నారు.

ఇక తన నారాయణ విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మందిని ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్‌ సర్వీసెస్‌ అధికారులుగా తీర్చిదిద్దిన మాజీ మంత్రి, కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినంత పనిచేశారని చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీతో నారాయణకు సంబంధం లేకపోయినా, ఆయన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ గా ఎప్పుడో వైదొలగినా ఆయనను కేసులో ఇరికించారని పేర్కొంటున్నారు.

అలాగే ఇటీవల కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడుతూ ఆ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసంలో అన్ని కులాల, పార్టీలు, మతాలవారు పాల్గొన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 99 శాతం కేసులను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తుల మీదే మోపిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తద్వారా కాపులను సంఘ విద్రోహ శక్తులుగా ప్రజల ముందు నిలబెట్టాలనే కుట్ర ఇందులో దాగి ఉందని ఆరోపిస్తున్నారు. మళ్లీ అందులోనూ వేర్వేరు పార్టీలకు చెందినవారందరినీ.. వైఎస్సార్సీపీకి చెందినవారిని కూడా జనసేన పార్టీలో కలిపేసి.. ఆ పార్టీవారే విధ్వంసం చేశారని కేసులు మోపడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కాపు జనాభా 27 శాతం ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్‌ సీట్లు గెలిచింది అంటే అది పూర్తిగా కాపులు ఓట్లేయబట్టేనని చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ మాత్రమే అక్కడ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఇప్పటికే ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారు లేరు. వీరు కాకుండా తాజాగా మరో నలుగురిని కూడా జగన్ తన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరిలోనూ ఒక్కరు కూడా కాపు అభ్యర్థి లేకపోవడం గమనార్హం. కూర్చుంటే సామాజిక న్యాయం.. లేస్తే సామాజిక న్యాయం అని ఊదరగొట్టే జగన్.. మరి రాష్ట్రంలోనే అత్యధికంగా 27 శాతం ఉన్న కాపు సామాజికవర్గానికి రాజ్యసభ సీటు కేటాయించకపోవడం ఏమిటో చెప్పాలని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు.

ఇక ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ఒక కార్యక్రమంలో వైఎస్ జగన్ బాబాయి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చుని ఆయనకు నమస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి చెల్లుబోయిన కులానికి చెందిన శెట్టిబలిజ సంఘాలు ఆయనను ఘెరావ్ చేశాయి. వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చుని శెట్టిబలిజల పరువు తీశారని మండిపడ్డాయి. మంత్రి అమలాపురం వస్తే ఆయన సొంత కులస్తులే చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే విచిత్రంగా అమలాపురం సీఐ బాలాజీ కారణమంటూ ఆయనపై వేటు వేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన బాలాజీని వీఆర్ కు పంపారు. దీనిపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం లెక్కచేయలేదని చెబుతున్నారు.

అదేవిధంగా కడప జిల్లాలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా కాపు సామాజికవర్గం చేతిలోనే ఉంది. ఏ పార్టీ తరఫున అయిన అక్కడ ఎంపీగా కాపు/బలిజ సామాజికవర్గం నేతలే ఎన్నికవుతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజంపేట సీటను బలిజలకే కేటాయించారు. అయితే జగన్‌ దీన్ని బ్రేక్‌ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో రాజంపేట సీటును పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి కేటాయించారు. వాస్తవానికి రాజంపేట నియోజకవర్గంలో కాపుల జ నాభా ఎక్కువ. అలాగే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తిరుపతి పట్టణంలోనూ బలిజలదే ఆధిపత్యం. ఇక్కడ కూడా కాపులను కాదని జగన్‌ తన సామాజికవర్గానికి చెందిన భూమన కరుణాకర్‌రెడ్డికి సీటు కట్టబెట్టారని పేర్కొంటున్నారు. రాజంపేట, తిరుపతి మాత్రమే కాకుండా రాయలసీమలో కాపు బలిజల జనాభా ఎక్కువ ఉన్న పలు నియోజకవర్గాల్లోనూ రెడ్లకే సీట్లు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా, ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. పవన్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు వైఎస్సార్సీపీ లక్ష్యంగా చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. కత్తి మహేష్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటివారిని పవన్ పైకి ప్రయోగించి ఆయన కుటుంబాన్ని, సతీమణిని, పిల్లలను దారుణఃగా బూతులు తిట్టించడం, అసభ్య వ్యాఖ్యలు చేయించడం చేయించింది వైఎస్సార్సీపీ, జగన్ ప్రభుత్వమేనని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. మేము ఏదో ఒక పదవి పడేస్తాం.. దాన్ని తీసుకోవాలి.. అంతేకానీ మా రాజ్యాధికారానికి అడ్డు వచ్చేలా కాపులు పార్టీ పెట్టడం ఏమిటనే పొగరు జగన్ లో కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు అడ్డు వస్తున్న పవన్ కల్యాణ్ పై తన సొంత మీడియా సాక్షి పత్రిక, టీవీలో ఇప్పటికే అనేక అసత్య కథనాలు, తప్పుడు వార్తలు జగన్ రాయించారని తీవ్ర విమర్శలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పడం మానేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని రాజకీయ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఇక పవన్ ను పావలా అని, చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడు పోయాడని నీచమైన గ్రాఫిక్సుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా పవన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలయినప్పుడు అట్టర్ ప్లాపు అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం, పవన్ సినిమా టికెట్ల రేట్లను ఐదు రూపాయల నుంచి 30 రూపాయలకు మించనీయకుండా చేయడం వంటివాటిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా భీమ్లా నాయక్ విడుదలయినప్పుడు వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సబ్ కలెక్టర్లు, ఎంఆర్వోలు, వీఆర్వోలు, పోలీసులు సినిమా థియేటర్లలో చేసిన హడావుడిని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇలా కాపు సామాజికవర్గాన్ని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాపు సామాజికవర్గం మొత్తం జనసేన పార్టీతో నడవడం ఖాయంగా కనిపిస్తోందని ఢంకా బజాయించి చెబుతున్నారు.
Tags:    

Similar News