ఏపీకి కొత్త సీఎస్ రాబోతున్నారా?

Update: 2020-05-13 09:30 GMT
ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పాలనా వ్యవహారాల్లో ఐఏఎస్ లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అందులోనూ, పాలనలో ముఖ్యమంత్రికి సీఎస్ గా వ్యవహరించే ఐఏఎస్ పాత్ర....ఎంతో కీలకం. జిల్లా కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రికి, కలెక్టర్లకు మధ్య వారధిలా సీఎస్ పని చేస్తుంటారు. ఈ కోవలోనే ఏపీ సీఎస్ నీలం సాహ్ని కూడా సమర్థవంతమైన ఐఏఎస్ గా పేరు తెచ్చుకున్నారు. ఏపీ సీఎస్ గా పనిచేస్తోన్న నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తనదైన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రితో ఎప్పటికపుడు సమీక్షిస్తూ....అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. మరోవైపు, జూన్ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. దీంతో, కొత్త సీఎస్ రేసులో పలువురు ఐఏఎస్ ల పేర్లు వినిపిస్తున్నాయి.

నీలం సాహ్ని తదనంతరం సీఎస్ పదవి చేపట్టేందుకు పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. సీనియర్ ఐఏఎస్ సతీష్ చంద్ర ఆ రేసులో ముందుండగా...నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో జగన్ కేసుల్లో గతంలో విచారణ ఎదుర్కొన్న ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎస్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, వీరి ఆశలకు సీఎం జగన్ తాత్కాలికంగా బ్రేకులు వేశారు. సాహ్ని పనితీరుపై సీఎం జగన్ సంతృప్తితో ఉన్నారు. దీంతో నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని జగన్ భావిస్తున్నారు. సాహ్ని కొనసాగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు.సీఎం జగన్ లేఖతో సీఎస్ రేసులో ఉన్న ఆశావహులకు కొంతకాలం నిరాశ తప్పేలా లేదు. మరి, సీఎం జగన్ లేఖకు స్పందించి సాహ్నిని సీఎస్ గా కొనసాగించేందుకు మోడీ అనుమతిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News