పవన్ టార్గెట్ వైసీపీ మాత్రమేనా ?

Update: 2021-11-01 15:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదాకు చేసిన పోరాటంలో అందరూ కలిసి తనను ఒంటరిని చేసి వదిలేశారట. వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ఎవరిమీదా ప్రత్యేకించి వైసీపీ మీద తనకు నమ్మకం లేదన్నారు. పవన్ తీరుచూస్తే కేవలం వైసీపీని టార్గెట్ చేసుకునేందుకే వైజాగ్ వచ్చినట్లుంది.

ఎందుకయ్యా అంటే ప్రత్యేకహోదా కోసం పవన్ పోరాటాలు చేశారట. ఆ పోరాటం చేసినపుడు ఏ పార్టీకూడా తన వెనక నిలబడలేదట. నిండుకుండకు అందరు కలిసి తూట్లు పొడిచినట్లు తన పోరాటాలకు తూట్లు పొడిచారట. అందుకనే తాను కూడా ప్రత్యేకహోదా పోరాటం నుండి వెనక్కు తగ్గినట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రత్యేకహోదాకు మద్దతుగా పవన్ చేసిన పోరాటాలు ఏమీలేవు. తిరుపతిలో, కాకినాడలో రెండు బహిరంగసభలు పెట్టడం మినహా ఇతరత్రా చేసిన పోరాటం ఏమీలేదు.

నిజానికి పవన్ కన్నా ప్రత్యేకహోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటమే ఎక్కువని చెప్పాలి. ఎలాగంటే రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ప్రత్యేకహోదాకు మద్దతుగా సభలు నిర్వహించారు. అలాగే రాష్ట్రబంద్ పాటించారు. జిల్లాల్లో ఆందోళనలు కూడా చేశారు. అదే సమయంలో ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు చేయటంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యార్ధులు ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొంటే టీసీలిచ్చి కాలేజీల నుండి పంపేయమని స్వయంగా చంద్రబాబే యాజమాన్యాలకు చెప్పారు.

ఉద్యమంలో పాల్గొనే విద్యార్ధులను జైలుకు పంపిస్తామని విద్యార్ధుల తల్లి, దండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. హోదా ఉద్యమంపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపినపుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు ? పైగా తానేదో బ్రహ్మండమైన ఉద్యమాలు చేస్తే అన్నీ పార్టీలు కలిపి తనను ఒంటరిని చేసి వదిలేశాయని సొల్లుకబర్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నది నరేంద్రమోడి సర్కార్ అయితే పవన్ టార్గెట్ చేసింది మొత్తం వైసీపీనే.

తనను ఓడించిన జనాలపై పవన్ కు ఇంకా మంట తగ్గినట్లులేదు. అందుకనే నా సభలకు జనాలు వస్తారు కానీ ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తారన్నారు. ఓట్లు వైసీపీకి వేసి నన్ను బాధ్యత తీసుకోమని అడగటం ఏమన్నా ధర్మమా అని అమాయకంగా ప్రశ్నించటం విడ్డూరమే. అందుకనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు రంగంలోకి దిగితే తాను వెనకుంటానని పవన్ చెప్పారు. ఒకవైపేమో వైసీపీపై తనకు నమ్మకం లేదని చెబుతునే వైసీపీ ఎంపీలు లేకపోతే పని జరగదనటం వపన్ మాటల్లోని డొల్లతనం తెలియజేస్తోంది.


Tags:    

Similar News