జగన్‌ తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అందుకేనా?

Update: 2023-05-25 12:28 GMT
2019 ఎన్నికల్లో తన వ్యూహాలతో వైసీపీకి అఖండ విజయాని కి కొంచెం ఉపయోగపడ్డారు .. ఐప్యాక్‌ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు సైతం ప్రశాంత్‌ కిశోరే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు.

ఇక గత ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని సాధించి పెట్టడం లో కొంచెం వాటా క్రెడిట్  ప్రశాంత్‌ కిశోర్‌ కి కూడా దక్కింది. అది కార్యకర్తల కష్టం అవ్వచ్చు జగన్ పాదయాత్ర కష్టం అవ్వచ్చు ప్రశాంత్ కిశోరె ఆ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకున్నారు అది వేరే విషయం. జగన్‌ మరోసారి తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఐ-ప్యాక్‌ సేవలను వైసీపీ పొందుతోంది. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జుల పరిస్థితిపై నివేదికలు ఇస్తోంది. ఈ నివేదికల ఆధారంగా చేసుకుని జగన్‌ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశాల్లో సూచనలు, సలహాలు, సుత్తిమెత్తని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మే 25న గురువారం ప్రశాంత్‌ కిశోర్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈ సమావేశం చాలా కీలకమైనదని చెబుతున్నారు.

రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి పై ప్రశాంత్‌ కిషోర్‌ సవివరమైన నివేదికను ఈ సమావేశంలో జగన్‌ కు అందిస్తారని తెలుస్తోంది. గెలిచే ఎమ్మెల్యేలు, ఓడిపోయే ఎమ్మెల్యేలు, మార్చాల్సిన అభ్యర్థులు, సులువుగా గెలిచే నియోజకవర్గాలు, 50-50 చాన్సులు ఉన్న నియోజకవర్గాలు, కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు, గెలవడానికి ఏమాత్రం అవకాశం లేని నియోజకవర్గాలు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఇలా తదితర అంశాలపై ప్రశాంత్‌ కిశోర్‌ సవివరమైన నివేదికను జగన్‌ కు అందిస్తారని టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే అట్టడుగు స్థాయి నుంచి మొదలుకొని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలపై ప్రశాంత్‌ కిశోర్‌ బృందం దృష్టి సారించింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ఐప్యాక్‌ సభ్యులు నిశితంగా అనుసరించారు.

పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇంటింటికి వెళ్లినప్పుడు, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాల్లోనూ ఐప్యాక్‌ బృందం పాల్గొంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్, జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, స్థానిక ఎమ్మెల్యేలపై ఆదరణను అంచనా వేయడానికి ఐప్యాక్‌ బృందం గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాలను బాగా గమనించింది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌... జగన్‌ తో జరగనున్న భేటీలో ఈ రెండు కార్యక్రమాలపై ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తారని తెలుస్తోంది. అలాగే ప్రతి ఎమ్మెల్యే పనితీరుతో సహా సవివరమైన నివేదికను అందిస్తారని టాక్‌ నడుస్తోంది.

అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో రాబోయే పది నెలల్లో జగన్‌ మోహన్‌ రెడ్డి అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ప్రశాంత్‌ కిశోర్‌ వివరిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీకి కొత్త ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చలు ఉంటాయని అంటున్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి తన పార్టీ వ్యూహం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ పథకాల కోసం బహిరంగ సభలకు హాజరవుతున్న ఆయన ఇప్పటికే తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

హెలిప్యాడ్, బహిరంగ సభ వేదికల వద్ద ఆయన పార్టీ నేతలతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సంభాషిస్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించేందుకు, మీడియాతో సహా విపక్షాల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రశాంత్‌ కిషోర్‌.. జగన్‌ కు ఎలాంటి వ్యూహాన్ని సిఫారసు చేస్తారో చూడాలి.

Similar News