ఏపీ సర్కారు నిర్ణయం బ్లండరా?

Update: 2021-01-19 10:39 GMT
ఏమిటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికీ అర్ధం కావటం లేదు. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టాలని జగన్ సర్కార్ డిసైడ్ చేసింది. రాష్ట్ర విభజనలో భాగంగానే కృష్ణా యాజమాన్య బోర్డు ఏపికి, గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణాకు అని డిసైడ్ అయ్యింది. సరే రాష్ట్ర విభజన జరిగిన ఆరేళ్ళవుతున్నా ఇంకా కృష్ణాయాజమాన్యబోర్డు హైదరాబాద్ నుండి ఏపికి తరలించలేదు.

అనేక చర్చల తర్వాత మొత్తానికి కృష్ణా యాజమాన్యబోర్డు ఏపికి తరలించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఆ బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో చర్చలు మొదలయ్యాయి. అయితే దీనికింతగా చర్చించాల్సిన పనిలేదని బోర్డును వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనతో అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కృష్ణా యాజమాన్య బోర్డుకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంకు ఏమాత్రం సంబంధం లేదు.

బోర్డు యాజమాన్యం ఎక్కడుండాలంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉంటేనే రైతులకు, అధికారులకు మంచిది. అంటే సాంకేతికంగా చూస్తే కృష్ణా యాజమాన్యబోర్డు కర్నూలులో ఉండటమే అన్నింటికి మంచిది. ఎందుకంటే కృష్ణానది ఏపిలోకి వచ్చేది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ప్రాంతం నుండే. కాబట్టి కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారిని పట్టించుకోకున్నా... విజయవాడలో పెట్టినా బానే ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం విచిత్రంగా విశాఖపట్నంలో ఏర్పాటుకు రెడీ అయిపోతోంది.

ఇదే విషయమై తెలంగాణా ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నిజానికి ఏపిలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా ఏపి ప్రభుత్వం ఇష్టం. ఇందులో తెలంగాణా అభ్యంతరాలకు పెద్దగా విలువ ఉండదు. అయినా కానీ ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణా ప్రభుత్వం కూడా అభ్యంతరం పెడుతోందంటే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎంత అయోమయంగా ఉందో అర్ధమైపోతోంది. మరి ఈ సలహా ఇచ్చిన వారెవరో, జగన్ ఆ సలహాను సులువుగా ఎలా ఆమోదించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
Tags:    

Similar News