తిరుపతి బీజేపీ అభ్యర్థి ఆమేనా?

Update: 2021-03-24 05:30 GMT
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయటంతో.. ఇప్పుడు అందరి చూపు దాని మీద పడింది. గడిచిన కొద్ది కాలంగా తిరుపతి ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తన అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఇప్పటికే ప్రకటించింది. దీంతో.. బీజేపీ అభ్యర్థి ఎవరన్న అంశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ బలం ఉంది. అయినప్పటికీ మిత్రుడికి హ్యాండిచ్చి మరీ.. పోటీ చేస్తున్న బీజేపీ ఎవరిని అభ్యర్థిగా నియమిస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి సమాధానంగా తాజాగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరు వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.

రత్నప్రభ సొంత రాష్ట్రమైన ఏపీలో ఆమెనుబరిలోకి దింపితే బాగుంటుందన్న ఆలోచనలో బీజేపీ ఉంది. కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె.. ఆ రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేశారు. 2018లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్అయ్యారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త విద్యాసాగర్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఏపీ క్యాడర్ కు చెందిన వారు. రత్నప్రభ గతంలో కొంతకాలం ఉమ్మడి ఏపీలో డిప్యుటేషన్ మీద పని చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఆమె దాదాపుగా ఖాయమవుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News