టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిస్థితి ఇంత దారుణ‌మా? న‌గ‌రంలో చ‌ర్చ‌!

Update: 2021-01-15 02:30 GMT
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు. ఇదేదో.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనో.. ఫోన్ సంభాష‌ణ‌ల్లోనో చెబుతున్న మాట కాదు.. బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. ``రాజుగారు ఎవ‌రిని ప‌ట్టించుకున్నారు?  మేం ఆయ‌న‌కు జెండాలు మోయాలి. ఆయ‌న తిడితే ప‌డాలి. ఆయ‌న‌కు మేం బానిసలం`` ఇదీ.. ఇటీవ‌ల విజ‌యన‌గ‌రం జిల్లాకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు బ‌హిరంగంగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌. విజ‌యన‌గ‌రం జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన అశోక్‌.. ఎమ్మెల్యేగా, ఎంపీగా త‌న‌దైన చ‌క్రం తిప్పారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014లో కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఫ‌లితంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీని ఆయ‌న త‌న గుప్పిట్లో పెట్టుకున్నార‌నే వాద‌న అప్ప‌ట్లో వినిపించింది. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత‌కు ద‌క్కాల్సిన స్థానాన్ని త‌న కుమార్తె అదితికి ఇప్పించుకున్నారు. ఇది రాజ‌కీయంగా తీవ్ర దుమారానికి దారి తీసి.. అశోక్ వ్య‌తిరేక వ‌ర్గం వైసీపీకి అనుకూలంగా చాప‌కింద నీరులా ప‌నిచేసింది. ప‌లితంగా అదితి గ‌జ‌ప‌తి రాజు ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీలో అశోక్‌కు వ్య‌తిరేక వ‌ర్గం మ‌రింత పెరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతలు  బ‌హిరంగంగానే  అశోక్‌గజపతిరాజు తీరుపై విమర్శలు చేస్తున్నారు.

సీనియర్లను పక్కనపెట్టి  అనుచరులకు పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఇక‌, పార్టీ కార్యాల‌యం విష‌యంనూ మీసాల గీత భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు.. త‌నను అన్ని విధాలా రాజ‌కీయంగా అణిచి వేశారంటూ. ‌ప‌డాల అరుణ.. విరుచుకుప‌డుతున్నారు. మ‌రోవైపు మీసాల గీత‌..  పార్టీలో ఉండాలో వ‌ద్దో తేల్చుకుంటాన‌ని, అశోక్ వ‌ల్ల పార్టీ నాశ‌నం అవుతుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు జిల్లాలో టీడీపీ మ‌ట్టిగొట్టుకుపోతుంద‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  ఇదిలావుంటే, స్థానికంగా కేడ‌ర్ కూడా బ‌ల‌హీన‌మ‌వుతుండ‌డం అశోక్ ను తీవ్రంగా కుదిపేస్తోంది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న వెంట తిరిగిన వారు కూడా మాన్సాస్ వ్య‌వ‌హారం త‌ర్వాత‌.. ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు.  గ‌తంలో ఆయ‌న ఏ ఆల‌యానికి వెళ్లినా.. రాజ‌మ‌ర్యాద‌లు ద‌క్కేవి. కానీ, ఇప్పుడు ఆయ‌న‌ను ఆహ్వానించేవారే లేకుండా పోయారు. అతి పెద్ద సంబ‌ర‌మైన విజ‌య‌న‌గ‌రం పైడిత‌ల్లి ఉత్స‌వాల‌కు క‌నీసం ఆహ్వానం అంద‌క‌పోవ‌డం.. రామ‌తీర్థం ఘ‌ట‌న‌లో వైసీపీ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. అశోక్‌ను ఎవ‌రూ వెనుకేసుకురాక‌పోవ‌డం, మ‌ద్ద‌తుగా ఒక్క‌రూ స్పందించ‌క‌పోవ‌డం వంటివి.. గ‌మ‌నిస్తే.. అశోక్ ప‌రిస్థితి ఇంత దారుణంగా మారిందా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.
Tags:    

Similar News