కంచుకోట అయిన జిల్లాలోనూ టీడీపీ తిప్పలు ప‌డుతోందా?

Update: 2022-08-18 01:30 GMT
కృష్ణా, గుంటూరు జిల్లాల త‌ర్వాత టీడీపీకి కంచుకోట అని చెప్ప‌ద‌గ్గ జిల్లా అనంతపురం. ఈ జిల్లాలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువే. అందుకే 2014లో ఏకంగా ఆరుగురు క‌మ్మ ఎమ్మెల్యేలు టీడీపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌రిటాల సునీత‌, ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రి, ప్ర‌భాక‌ర్ చౌద‌రి, వ‌ర‌దాపురం సూరి, ప‌య్యావుల కేశ‌వ్ వంటి బ‌ల‌మైన క‌మ్మ నేత‌లు అనంత‌పురం జిల్లా టీడీపీలో ఉన్నారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ గాలి వీయ‌డంతో మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు చోట్ల మాత్ర‌మే టీడీపీ గెల‌వ‌డం గ‌మ‌నార్హం. గెలిచిన ఇద్ద‌రు కూడా క‌మ్మ నేత‌లే. టీడీపీ నుంచి గెలిచిన‌వారిలో బాల‌కృష్ణ‌, ప‌య్యావుల కేశ‌వ్ ఉన్నారు.

ఇంత‌టి కీల‌క‌మైన జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోమారు స‌త్తా చాటాల‌ని టీడీపీ ఆశిస్తోంది అయితే టీడీపీకి ప‌రిస్థితులు ఆశాజ‌న‌కంగా లేవ‌ని అంటున్నారు. నేత‌ల మ‌ధ్య విభేదాలు, అస‌మ్మ‌తి, గ్రూపు రాజ‌కీయాలు చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి తెస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఉర‌వ‌కొండ‌లో గెలిచిన ప‌య్యావుల భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా హైద‌రాబాద్లోనే ఉంటున్నార‌ని స‌మాచారం. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌క‌పోవ‌డంతో ఏ ప‌నులూ కావ‌డం లేద‌ని అంటున్నారు. అదేవిధంగా హిందూపురంలో బాల‌కృష్ణ ప‌రిస్థితి కూడా ఇంతేన‌ని.. ఆయ‌న సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఎక్కువ హైద‌రాబాద్ లోనే ఉంటున్నార‌ని చెబుతున్నారు. అప్పుడప్పుడు ఏదో చుట్ట‌పు చూపులా త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గానికి రావడం లేద‌ని పేర్కొంటున్నారు.

ఇక ప‌రిటాల సునీత కుమారుడు శ్రీరామ్ ధ‌ర్మ‌వ‌రం టికెటు ఆశిస్తున్నారు. రాఫ్తాడు టికెట్ త‌న త‌ల్లి సునీత‌కు, ధ‌ర్మ‌వ‌రం టికెట్ తన‌కూ ఇవ్వాలంటున్నారు. ధ‌ర్మ‌వరం నుంచి 2014లో వ‌ర‌దాపురం సూరి గెలిచారు. 2019లో ఓడిపోయాక ఆయ‌న బీజేపీలో చేరారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీలోకి వ‌స్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ వ‌ర‌దాపురం సూరిని పార్టీలో చేర్చుకుని ధ‌ర్మ‌వ‌రం సీటు ఇస్తే తాను టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని ప‌రిటాల శ్రీరామ్ తేల్చిచెబుతున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు శ్రీరామ్ పిత‌లాట‌కంతో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని చెబుతున్నారు. ప‌రిటాల శ్రీరామ్ మాట‌ల‌కు వ‌ర‌దాపురం సూరి వ‌ర్గీయులు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నార‌ని అంటున్నారు.

పుట్ట‌ప‌ర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై కూడా అస‌మ్మ‌తి ఉంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుట్ట‌ప‌ర్తి నుంచి సైకం శ్రీనివాస‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో జేసీ ప్ర‌భాక‌ర్ పెత్త‌నం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే పుట్టపర్తి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పీసీ గంగన్న కూడా పల్లె ర‌ఘునాథ‌రెడ్డిపై తిరుగుబావుటా ఎగరేశార‌ని అంటున్నారు.

ఇక కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తీవ్ర స్థాయికి చేరింద‌ని చెప్పుకుంటున్నారు. అత్తార్‌ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్‌ మధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంద‌ని టాక్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ నాకంటే నాకే వ‌స్తుంద‌ని ఇద్ద‌రు నేత‌లు చెప్పుకుంటూ తిరుగుతున్నార‌ని స‌మాచారం. ఇక పెనుకొండ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కే టికెట్ ఇస్తామ‌ని స్వ‌యంగా ఇటీవ‌ల చంద్ర‌బాబే ప్ర‌క‌టించార‌ని తెలుస్తోంది. దీంతో ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే పార్థ‌సారధి క‌స్సుమంటున్నార‌ని చెబుతున్నారు.

ఇక రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గం మడ‌కశిర‌లో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం వీరిద్ద‌రూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా వీటిని చ‌క్క‌దిద్దుకోక‌పోతే టీడీపీకి మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట‌లాంటి జిల్లా అయిన అనంత‌పురంలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌ను తొల‌గించాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుదేన‌ని అంటున్నారు.
Tags:    

Similar News