ఐసిస్ న‌ర‌మేథం మళ్లీ మొద‌లైంది!

Update: 2017-04-10 09:33 GMT
ప్ర‌పంచంలోనే క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదులుగా పేరుప‌డ్డ ఐసిస్ ముష్క‌రులు ఇటీవ‌లి కాలంలో కాస్తంత త‌గ్గిన‌ట్టే క‌నిపించింది. అగ్ర‌రాజ్యం అమెరికా సైనిక దాడుల్లో కీల‌క నేత‌ల‌ను పోగొట్టుకున్న ఐసిస్‌... ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింద‌ని, ఇకపై ఆ సంస్థ ఆగ‌డాలు దాదాపుగా ఆగిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపించింది. అయితే నిన్న ఈజిప్ట్ లో జరిగిన రెండు భీక‌ర దాడుల‌తో తాను ఇంకా పూర్తి చావ‌లేద‌ని ఐసిస్ చాటి చెప్పిన‌ట్టైంది. ఈజిప్ట్‌లోని రెండు ప్రధాన న‌గ‌రాల్లో విరుచుకుప‌డ్డ ముష్క‌రులు... త‌మ‌దైన శైలిలో శ‌క్తివంత‌మైన బాంబుల‌ను పేల్చారు. ఈ దాడుల్లో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోగా... 120 మంది దాకా గాయ‌ప‌డ్డారు.

ఈ రెండు దాడులు కూడా ఈజిప్ట్ లోని చ‌ర్చిల‌ను ల‌క్ష్యంగా చేసుకుని జ‌రిగిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఈజిప్ట్ రాజ‌ధాని కైరోకు 60 మైళ్ల దూరంలో ఉన్న నైల్ డెల్టా సిటీలోని ఓ చ‌ర్చి వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ ఉగ్ర‌వాది త‌న శ‌రీరానికి అమ‌ర్చుకున్న బాంబును పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో అత‌డితో పాటు 27 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్నాడు. ఈ పేలుడులో 78 మంది దాకా ఆసుప‌త్రి పాల‌య్యారు. ఇక ఈజిప్ట్‌కే చెందిన మ‌రో న‌గ‌రం అలెగ్జాండ్రియాలోని ఓ చ‌ర్చిలో ఐసిస్ ఉగ్ర‌వాదులు అమ‌ర్చిన బాంబు పేలిన ఘ‌ట‌న‌లో 16 మంది చ‌నిపోగా,  41 మంది గాయ‌ప‌డ్డారు. కేవ‌లం కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలో చోటుచేసుకున్న ఈ రెండు దాడుల్లో మొత్తం 43 మంది చ‌నిపోగా, 120 మంది దాకా గాయ‌ప‌డ్డ‌ట్టైంది.

ఈ దాడితో ఈజిప్ట్‌లో క‌ల‌క‌లం రేగింది. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ దాడులు జ‌రిగిన కాసేప‌టికే రంగంలోకి దిగిన ఐసిస్ కీల‌క నేత‌లు... ఈ దాడుల‌కు పాల్ప‌డింది తామేన‌ని నిర్భ‌యంగా ప్ర‌క‌టించుకున్నారు. మ‌రోవైపు ఈజిప్ట్ అధ్య‌క్షుడు అబ్దుల్ ఫత్తా ఆల్ సిసి... ఐసిస్ దుశ్చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఐసిస్ దాడుల‌తో భీతిల్లిన ఈజిప్ట్ ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పేందుకు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా వెనువెంట‌నే స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఐసిస్ దాడుల‌ను ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్ర‌క‌టించిన మోదీ... క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News