చైనాకు షాకిచ్చిన ఐసిస్‌

Update: 2017-03-02 16:10 GMT
భార‌త్ స‌త‌మ‌తం అవుతున్న విష‌యం ఏది అయిన‌ప్ప‌టికీ పొరుగునే ఉన్న చైనా మ‌న‌ల్ని ఇర‌కాటంలో ప‌డేసే విధంగానే వ్య‌వ‌హ‌రిస్తుంది. అది కాశ్మీర్ ను భార‌త్ అంత‌ర్భాగంగా గుర్తించ‌డం కావ‌చ్చు, ఉగ్ర‌వాదుల‌పై నిషేధం విధించే విష‌యంలో మ‌ద్ద‌తు, అణ్వస్త్రాల‌ను క‌ట్టడి చేయ‌డం ఇలా ఏదైనా ప‌క్క‌లో బ‌ల్లెంలా మార‌డం చైనా నైజం. పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ మ‌న దేశం విష‌యంలో ఎప్పుడూ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న చైనాకు త‌గిన మొగోడి రూపంలో ఇప్పుడు ఐసిస్ మారింద‌ని అంటున్నారు. తాజా ప్ర‌క‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నం. ఓవైపు ఇరాక్‌లో తాము ఓడిపోయిన‌ట్లు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బ‌గ్దాది ప్ర‌క‌టించినా.. మ‌రోవైపు చైనాలో మాత్రం ఆ సంస్థ ఉగ్ర‌వాదులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. తాము క‌చ్చితంగా దేశానికి తిరిగి వస్తామ‌ని, చైనాలో ర‌క్తం ఏరులై పారుతుంద‌ని ఉయ్‌గ‌ర్ మైనార్టీకి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు స్ప‌ష్టంచేస్తున్నారు. చైనా ల‌క్ష్యంగా ఐఎస్ చేసిన తొలి హెచ్చ‌రిక ఇదే.

అర‌గంట నిడివి గ‌ల వీడియోలో ఐఎస్ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు అమెరికాకు చెందిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్ల‌డించింది. త‌న ప‌శ్చిమ ప్రాంత‌మైన జిన్‌జియాంగ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన అక్క‌డి ఉయ్‌గ‌ర్ వేర్పాటువాదులే కార‌ణ‌మ‌ని చైనా చాలా ఏళ్లుగా చెబుతూ వ‌స్తున్న‌ది. వీరికి గ్లోబ‌ల్ జిహాదీ గ్రూపుల‌తో సంబంధాలు కూడా ఉన్నాయ‌ని ఆరోపించింది. తాజా వీడియాలో ఓ ఇన్ఫార్మ‌ర్‌ను హ‌త్య చేసే ముందు ఓ ఉయ్‌గ‌ర్ ఐఎస్ ఉగ్ర‌వాది ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. "మీ చైనీస్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను అర్థం చేసుకోరు. మేము ఖ‌లీఫా సైనికులం. ఆయుధాల‌తోనే మీకు స‌మాధానం చెబుతాం. ర‌క్తాన్ని ఏరులుగా పారిస్తాం" అని ఆ వీడియోలో హెచ్చ‌రించాడు. ఎక్కువ‌గా ముస్లిం జ‌నాభా ఉన్న ఈ ప్రాంతంపై చైనా వివ‌క్ష చూపుతున్న‌ద‌ని ఉయ్‌గ‌ర్లు ఆరోపిస్తున్నారు. ఉయ్‌గ‌ర్లు త‌మ‌కు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని అంగీక‌రించ‌డం ఇదే తొలిసారి. ఇక ఐఎస్ నేరుగా చైనాకు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం కూడా మొద‌టిసారేన‌ని నేష‌న‌ల్ సెక్యూరిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రేలియ‌న్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఎక్స్‌ప‌ర్ట్ మైకేల్ క్లార్క్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల ల‌క్ష్యం చైనానేన‌ని ఈ వీడియో ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని ఆయ‌న తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News