ఇర‌గ‌దీసిన ఇస్రో...100 ప్ర‌యోగం స‌క్సెస్!

Update: 2018-01-12 10:35 GMT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉప గ్ర‌హ ప్ర‌యోగాల‌లో త‌న అప్ర‌తిహ‌త జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఎన్నో ఉప‌గ్ర‌హాల‌ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన ఇస్రో మరో ఘన విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అజేయంగా సెంచ‌రీ కొట్టిన ఇస్రో భార‌తీయుల ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 100వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించి హిస్ట‌రీ క్రియేట్ చేసింది. 42వసారి పీఎస్ ఎల్‌ వీ సీ-40 నింగిలోకి దూసుకెళ్లింది.  పీఎస్ ఎల్‌ వీ సీ-40 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) వాతావరణ పరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2తోపాటు మరో 30 ఉపగ్రహాలను విప‌ణిలోకి తీసుకెళ్లింది.

వీటి మొత్తం బరువు 1,323 కేజీలు. అందులో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. రాత్రి వేళల్లో ఫొటోలు తీయగలిగే సాంకేతిక పరిజ్ఞానం దీనిలో ఉంది. ఈ ఉప‌గ్రహాలు రెండు క‌క్ష్య‌ల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డం విశేషం. ఈ ప్ర‌యోగంలో తొలి దశ విజయవంతమైంద‌ని, హీట్ షీల్డ్  వేరైంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. రెండు - మూడు ద‌శ‌లు కూడా నిర్ణీత స‌మ‌యాల్లో పూర్త‌య్యాయ‌ని - నాలుగో దశ ఇగ్నైట్ అయి - నిర్దేశిత సమయంలో ఇంజిన్ షట్ ఆఫ్ కావ‌డంతో ఈ ప్ర‌యోగం విజయవంతమైందని వారు చెప్పారు. కార్టోశాట్ 2ఎస్ అనుకున్నట్లుగానే విడివడింని తెలిపారు. ఈ ప్ర‌యోగంలో అన్ని ఉపగ్రహాలు విజయవంతంగా విడివడి నిర్దేశిత కక్ష్యల్లో చేరాయని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌యోగాన్ని విజ‌యంతంగా నిర్వ‌హించిన ఇస్రో ప‌రిశోధ‌కుల‌కు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ - ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు తెలిపారు. వాస్త‌వానికి గ‌త ఏడాది ఆగ‌స్ట‌లోనే ఈ ప్ర‌యోగం చేప‌ట్టారు. అయితే, కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల అది విజ‌యవంతం కాలేదు.
Tags:    

Similar News