ఏపీ లో మారె 'మినిస్టర్స్' వీళ్ళుయేనా !

Update: 2021-08-16 15:30 GMT
ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండే విష‌యాల‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది. అందులో ఒక‌టి.. స్థాయికి మించి ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు.. మ‌రొక‌టి జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న మార్పులు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లుసుకున్నా.. కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకున్న మంత్రి ప‌దవులు ఎవ‌రికి ద‌క్కుతాయో అనే మాట‌లే వినిపిస్తున్నాయంటా!  2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో అధికారం చేప‌ట్టిన‌ప్పుడే రెండేన్న‌రేళ్లు గ‌డిచిన త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో మార్ప‌లు ఉంటాయ‌ని.. అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని సీఎం జ‌గ‌న్ అప్పుడే చెప్పారు. 2019 మే 30న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. మ‌రో మూడు నెలల్లో ఆయ‌న అధికారం చేప‌ట్టి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలోనే మంత్రివ‌ర్గంలో మార్పుపై ఊహాగానాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

మొద‌ట మంత్రివ‌ర్గం ఏర్పాటు చేసిన‌ప్పుడే రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో మంత్రుల ప‌నితీరును బ‌ట్టి మార్కులు కేటాయించి.. బాగా ప‌నిచేయ‌ని మంత్రుల స్థానంలో కొత్త‌వాళ్ల‌ను తీసుకుంటున్నాన‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ మ‌ధ్య‌లో క‌రోనా కార‌ణంగా త‌మ సామ‌ర్థ్యం నిరూపించుకోలేక‌పోయామ‌ని మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని ప‌లువురు మంత్రులు జ‌గ‌న్‌ను కోరారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఏపీలో నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన జ‌గ‌న్‌.. మంత్రి వ‌ర్గంలో మార్పుపై హింట్ ఇచ్చిన‌ట్లే క‌నిపించారు. మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న కొంత‌మందికి నామినేటెడ్ పోస్టుల‌తో స‌రిపెట్ట‌గా.. మ‌రికొంత‌మందికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ఆశ‌ను మిగిల్చారు. అందులో ముఖ్యంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్మే రోజా ఉన్నారు. మొద‌టి సారే మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌నుకున్న ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ ప‌దవితో ఆమెను శాంతింప‌జేశారు. కానీ ఇటీవ‌ల ఆ ప‌ద‌వి నుంచి ఆమెను త‌ప్పించ‌డంతో ఈ సారి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు పార్టీలో జోరుగా సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఇద్ద‌రిని తొల‌గించి ఆ స్థానాల్లో కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. కాపుల్లో కూడా ముగ్గురిని త‌ప్పించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. బీసీ సామాజిక వ‌ర్గం ప‌రంగా చూస్తే ఆ మంత్రుల్లో అంద‌రినీ త‌ప్పించి కొత్త‌వాళ్ల‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉందని స‌మాచారం. ఎస్సీల్లో దాదాపు ఒక మినిస్ట‌ర్‌ను మిన‌హాయిస్తే అంద‌రిని మార్చే ఆస్కార‌ముంద‌ని తెలుస్తోంది. ఇక ఎస్టీల్లో కూడా మార్పు ఉంటుంద‌ని అంటున్నారు. అయితే తాగా ప‌రిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మంత్రుల‌పై వేటు త‌ప్పించి పెద్ద‌గా మార్పులు ఉండే అవ‌కాశం లేద‌ని అమ‌రావ‌తి వ‌ర్గాలు అంటున్నాయి. ఒక‌వేళ సీనియ‌ర్ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పిస్తే ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మాత్రం మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఈ సారి క‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ఆశాభావంతో జిల్లాల్లో జోరుగా చ‌ర్చ‌లు సాగిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి మంత్రి వ‌ర్గంలో మార్పులు భారీ ఎత్తున ఉంటాయా? ఎవ‌రిని తొల‌గిస్తారు? ఎవ‌రిని తీసుకుంటారు? అనేది తేలాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News