టీమిండియాలో బీసీసీఐ వేలు.. గంగూలీ మార్క్?

Update: 2021-12-17 12:30 GMT
ఎదురులేని కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకవైపు.. కెప్టెన్సీకే కొత్త నిర్వచనం చెప్పిన సౌరభ్ గంగూలీ మరోవైపు.. ఒకరు టీమిండియా సారథి.. మరొక రు బీసీసీఐ అధిపతి.. ఆటలో ప్రతిభతో, వ్యూహాల పదునులో ఇద్దరూ మేటి.

అయితే, ఇప్పుడు భారత జట్టులో ఏం జరుగుతోంది? కోహ్లికి, రోహిత్ శర్మకు పొసగడం లేదా..? కోహ్లి ధోరణి బీసీసీఐకి నచ్చడం లేదా? ‘కెప్టెన్సీ’వివాదం చినికిచినికి గాలివానలా మారిందా? తనకు ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదని భావించే కోహ్లికి.. తనదైన పాలనా ముద్ర చూపే గంగూలీ మార్క్ పాలనకు సరిపడడం లేదా? అసలేం జరుగుతోంది?

బీసీసీఐ పాత్రేమిటి అసలు?

కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో రాణించింది. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక సిరీస్‌లు గెలుపొందింది. కానీ, ఐసీసీ టోర్నీల్లో గెలవలేపోవడం, జట్టు ఎంపికలో ఒంటెత్తు పోకడలు.. అతడికే చేటు చేసినట్లు కనిపిస్తోంది. అయితే, రవిశాస్త్రి కోచ్ గా ఉన్నన్ని రోజులు కోహ్లి హవా నడిచింది. అప్పుడు బీసీసీఐ కి కూడా పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు.

దీంతో కోహ్లి మాట చెల్లుబాటైంది. అప్పట్లో విరాట్ మాట ఎంతగా సాగిందంటే.. దిగ్గజ్జ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి తప్పుకొనేలా.. రవిశాస్త్రి కి మళ్లీ పిలుపిచ్చి హెడ్ కోచ్ చేసేంతగా.

ఫామ్ తగ్గింది.. పవర్ తగ్గింది

రెండేళ్లుగా కోహ్లి గొప్ప ఫామ్ లో లేడు. ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయితే, అర్ధ శతకాలు మాత్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో జట్టు కూడా విజయాలు సాధిస్తుండడంతో పెద్దగా పట్టింపులోకి రాలేదు.

కానీ, టెస్టు చాంపియన్ షిప్ ఓటమి, టి20 ప్రపంచ కప్ ఓటమితో కోహ్లి ప్రతిష్ఠ మసకబారింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం టి20పగ్గాలను వదులుకుంటానని ప్రకటన చేశాడు.

రోహిత్‌ టీ20లకు కెప్టెన్సీ చేపట్టగా తొలి టెస్టుకు రహానె నాయకత్వం వహించాడు. చివరికి కోహ్లీ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చి మళ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు ఎంపిక చేసినప్పుడే బీసీసీఐ కోహ్లీకి షాకిచ్చింది.

ఇకపై వన్డేలకు సారథిగా రోహిత్‌ను ప్రకటించింది.టీ20 సారథ్యం నుంచి హుందాగా తప్పుకొన్న కోహ్లీని సెలక్షన్‌ కమిటీ ఇలా తొలగించడం వివాదాస్పదంగా మారింది. సారథ్యం తొలగింపుపై కోహ్లీ - బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మీడియాతో పంచుకున్న విషయాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి.

వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓటమిపాలయ్యాక.. కోహ్లి కెప్టెన్సీపై సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున చర్చ జరిగింది. కోహ్లీ ఐపీఎల్‌లో ఆర్సీబీని, ఇటు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోవడమే అందుకు కారణం.

మరోవైపు రోహిత్‌ ఐపీఎల్‌లో ఐదుసార్లు ముంబయిని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దీంతో కోహ్లీని తొలగించాలనే డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు కోహ్లీ, రోహిత్‌ మధ్య విభేదాలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై కొద్దికాలం మౌనం పాటించిన విరాట్‌.. చివరికి తమ మధ్య అలాంటివేమీ లేవని మీడియాకు చెప్పాడు. దాంతో ఆ వివాదానికి తెరపడింది.

వన్డే లకు కెప్టెన్ గా ఉంటానన్నాడు.. బీసీసీఐ వద్దంది

టెస్టులు,వన్డేలకు కెప్టెన్ గా కొనసాగాలని విరాట్ బలమైన కోరిక. కానీ, బీసీసీఐ ఉద్దేశం వేరేలా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు ఉంటే సమన్వయం కుదరదని భావిస్తోంది.

కోహ్లి సేవలు, అతడి ప్రతిభ ప్రకారం చూసినా, బీసీసీఐ ప్రణాళికల ప్రకారం చూసినా రెండూ సమంజసమే. అయితే, ఇక్కడ మార్పు ప్రక్రియ జరగాల్సింది. కానీ అలా జరగలేదు. కోహ్లి, గంగూలీ వాదనలు భిన్నంగా ఉన్నాయి. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు తాము వారించామని గంగూలీ అంటున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని వన్డే కెప్టెన్సీ తప్పించామని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందే వెల్లడించినట్లు పేర్కొన్నాడు. కోహ్లిమాత్రం గంటన్నర ముందు చెప్పారని అంటున్నాడు. టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు తనతో మాట్లాడారని తెలిపాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు కాల్‌ ముగియడానికి ముందు తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారన్నాడు. దీంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తాయని స్పష్టంగా అర్థమవుతోంది.

ఎవరికి వారే

గంగూలీ.. కోహ్లి ఎవరికి వారే తమ ముద్రను బలంగా చూపాలనుకునే వ్యక్తిత్వాలున్నవారు. ధోని, రోహిత్, కుంబ్లే, ద్రవిడ్ లా సర్దుకుపోయే వారు కాదు. దాని ఫలితమే ప్రస్తుత పరిణామాలు. వాస్తవానికి కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేటప్పడు బీసీసీఐ సరిగా వ్యవహరించలేదు అన్నది స్పష్టమైపోతోంది. కోహ్లికి సర్ది చెప్పి జట్టు ప్రయోజనాలను వివరించడంలో బీసీసీఐ విఫలమైంది.

టెస్టు జట్టు ఎంపిక కాల్ ముగియడానికి ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారని కోహ్లి అంటున్నాడు. టీ20 కెప్టెన్సీని వదిలేయడంపై పునరాలోచన చేయకూడదని కోహ్లి నిర్ణయించుకోవడంతో సెలక్టర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించారని గంగూలీ ఇంతకుముందు చెప్పాడు.

‘‘టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని మేం కోహ్లీతో చెప్పాం. కానీ కొనసాగనని అతడు అన్నాడు. ఈ నేపథ్యంలో.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదని సెలక్టర్లు భావించారు’’ అని దాదా అన్నాడు. దీన్నిబట్టే కోహ్లికి బీసీసీఐకి విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

జట్టుకిది మేలు చేసేది కాదు..

ట్రోఫీలు గెలవకున్నా.. కోహ్లి వ్యక్తిగతంగా రాణించకున్నా.. జట్టు సమష్ఠి ప్రదర్శనతో ఇప్పటివరకు గొప్ప గా విజయాలు సాధించింది. కానీ, తాజా పరిణామాలు మాత్రం జట్టుకు మేలు చేసేవి కాదు. కోహ్లి -రోహిత్ మధ్య జట్టు రెండుగా చీలిపోయినా అనుమానించాల్సింది ఏమీ లేదు అన్నంతగా బయట చర్చలు సాగాయి. చక్కగా ఉన్న జట్టులో బీసీసీఐ పుల్ల పెట్టినట్టు కనిపిస్తోంది.

సాఫీగా సాగిపోవాల్సిన వ్యవహారాన్ని వివాదాస్పదం చేసింది. 2006లో తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. తాజా వివాదానికి గంగూలీ ముగింపు పలకాల్సింది. అయితే, మరే ఉద్దేశంలోనే గంగూలీ అలా చేయలేకపోయాడు. అసలు రోహిత్ -కోహ్లి మధ్య విభేదాలు అని అనుమానం ఉన్నప్పుడే బీసీసీఐ రంగంలోకి దిగాల్సింది.

రెండేళ్ల నుంచి గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ , బోర్డు ఆ పని చేయలేకపోయింది. తీరా కెప్టెన్సీ వివాదంలో వేలు పెట్టి వ్యవహారం సరిగా నడిపించలేక చేయి కాల్చుకుంది. దీని ప్రభావం జట్టుపై ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News