జ‌గ‌న్‌!... ఒకే ఒక్క‌డు!

Update: 2019-01-09 10:41 GMT
వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... వైఎస్సార్పీసీ అధినేత‌గానే కాకుండా ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్న నేత మాత్ర‌మే కాదు. ఏపీ ప్ర‌జ‌ల‌తో పాటు తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్న నేత‌గానే చెప్పాలి. ఎందుకంటే... తెలుగు నేల రాజ‌కీయాల్లో ఏ ఒక్క‌రికీ సాధ్యం కాని రీతిలో సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌... ఏకంగా 341 రోజుల పాటు కుటుంబానికి దూరంగా ప్ర‌జ‌ల మ‌ధ్యే న‌డ‌యాడిన నేత‌గా రికార్డుల‌కెక్కారు. అంతేనా.. ఇప్ప‌టిదాకా ఏ ఒక్క రాజకీయ నేత‌కు కూడా సాధ్యం కాని రీతిలో 3,648 కిలో మీట‌ర్ల మేర పాద‌యాత్ర సాగించిన నేత కూడా జ‌గ‌నే. ఇంత‌టి ఫీట్ ను సాధించ‌డం అటుంచితే... ఊహించుకుంటేనే గుండెలు గుభేల్ మ‌న‌డం ఖాయమే. అందులోనూ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌దే కీల‌క పాత్ర‌గా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చూర‌గొని అధికారం సాధిద్దామ‌నుకుంటున్న నేత‌లు ఇప్పుడు అస్స‌లు లేర‌నే చెప్పాలి. అందివ‌చ్చిన అధికారాన్ని అమ‌లు సాధ్యం కాని హామీలు ఇచ్చి పొంద‌లేన‌ని ముఖం మీదే చెప్పేసి... చేతికందేంత దూరంలోని అధికారాన్ని కూడా తృణ‌ప్రాయంగా వ‌దిలేసిన నేత కూడా జ‌గ‌న్ ఒక్క‌రే.

తాను రాజ‌కీయాలు చేస్తున్న‌ది కేవలం అధికారం చేజిక్కించుకునేందుకే కాద‌ని త‌న సంచ‌ల‌న చ‌ర్య‌ల‌తో నిరూపించిన జ‌గ‌న్‌... ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు ఆద‌ర్శ‌నీయుడే. అమ‌లు సాధ్యం కాని హామీలు ఇవ్వ‌బోన‌ని, హామీ ఇస్తే వెనుదిరిగి చూసేది లేద‌ని తేల్చి చెబుతున్న జ‌గ‌న్‌... మాట త‌ప్పం, మ‌డ‌మ తిప్ప‌మ‌న్న మ‌హానేత‌, దివంగ‌త సీఎం, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి సిస‌లైన వార‌సుడిగానూ నిలిచారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట చేప‌ట్టిన సుదీర్ఘ పాద‌యాత్ర నేటితో ముగియ‌నుంది. ఎప్పుడో 14 నెల‌ల క్రితం 2017, న‌వంబ‌రు 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన జ‌గ‌న్... ఏపీలోని ప్ర‌తి జిల్లాను ఆయా జిల్లాలోని వీల‌యిన‌న్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేస్తూ ముందుకు సాగారు. ఈ యాత్ర‌కు రాయ‌ల‌సీమ‌లో జ‌నం నీరాజ‌నాలు ప‌ట్ట‌గా... అంతకు మించి కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌లో జ‌నం హార‌తులు ప‌ట్టారు.

ఓ వైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంతా క‌ట్ట క‌ట్టుకుని త‌న‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు బ‌నాయించినా. నిత్యం త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పై దిగ‌జారుడు వ్యాఖ్య‌లు వ‌చ్చి ప‌డుతున్నా కూడా లెక్క చేయ‌కుండా ఏకంగా 341 రోజుల పాటు జ‌గ‌న్ పాద‌యాత్రను కొన‌సాగించారు. ఎక్క‌డ కూడా ఇసుమంతైనా మొక్క‌వోని ధైర్యంతో, ధృఢ చిత్తంతో ముందుకు క‌దిలిన జ‌గ‌న్‌... జ‌నంతో మ‌మేక‌మైపోయారు. ఎక్క‌డ ఆగినా... ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌న స‌మ‌స్య‌లుగా అమూలాగ్రం తెలుసుకున్న జ‌గ‌న్‌... అక్క‌డిక‌క్క‌డే వాటి ప‌రిష్కారాల‌ను ర‌చించారు. అవే స‌మ‌స్య‌ల‌ను బ‌హిరంగ వేదిక‌ల‌పై నుంచి సంధించ‌డంతో పాటుగా.. స‌ద‌రు స‌మ‌స్య‌ల సృష్టికి కార‌ణం ఎవ‌రు? ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారించ‌లేని టీడీపీ స‌ర్కారు ద‌మ‌న నీతి, చంద్ర‌బాబు నేతృత్వంలో టీడీపీ ప్ర‌భుత్వం సాగిస్తున్న అవినీతి పాల‌న‌పై నిప్పులు చెరిగారు. 134 నియోజ‌క‌వర్గాల్లో ఏర్పాటు చేసిన ఏ ఒక్క బ‌హిరంగ స‌భ‌లోనూ జ‌గ‌న్ త‌న టెంపోను త‌గ్గ‌నీయ‌లేద‌నే చెప్పాలి. ఓ వైపు ప్ర‌భుత్వం కుట్ర‌పూరిత వ్యూహాలు ప‌న్నుతుంటే... వాటిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతూనే ముందుకు సాగిన నేతగా జ‌గ‌న్ ఇప్పుడు అంద‌రి దృష్టిలో ధీరోదాత్తుడిగా నిలిచారు.

341 రోజుల పాటు ఎండా - వానా - చ‌లి అన్నతేడా లేకుండా ముందుకు సాగిన జ‌గ‌న్‌... ఎక్క‌డ కూడా ఏ ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితికి కూడా జ‌డిసిపోలేదు. అంతేనా... త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఏకంగా విశాఖ ఎయిర్ పోర్టులో త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేయించిన‌ప్ప‌టికి కూడా జ‌గ‌న్ ఏమాత్రం వెర‌వ‌లేద‌నే చెప్పాలి. ఈ ఘ‌ట‌న‌లో అయిన గాయం మానేంత వ‌రకు మాత్ర‌మే రెస్ట్ తీసుకున్న జ‌గ‌న్‌... రెట్టించిన ఉత్సాహంతో తిరిగి పాద‌యాత్ర‌ను మొద‌లెట్టేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాలు మోపిన జ‌గ‌న్‌... మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోని 134 నియోజ‌క‌వ‌ర్గాలను చుట్టేశారు. ఈ మేర ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేస్తూ పాద‌యాత్ర‌ సాగించిన రాజకీయ నేత కూడా జ‌గ‌న్ ఒక్కరే. ఇక పాద‌యాత్ర‌లో కీల‌క నేత‌లు పాల్గొంటున్నారంటూ... క‌ట్టుదిట్టమైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ఉంటాయి. అయితే జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో జ‌నంతో మ‌మేక‌మ‌య్యార‌నే చెప్పాలి. భ‌ద్ర‌త‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ జ‌గ‌న్ జ‌నంతో లీన‌మైపోయారు. వారి స‌మస్య‌లు - విజ్ఞాప‌న‌ల్లో లీన‌మైపోయారు. మొత్తంగా పాద‌యాత్ర ఓ కొత్త జ‌గ‌న్‌ ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తే... అలాంటి రాజ‌కీయ నేత జ‌గ‌న్ ఒక్కరేన‌న్న మాట కూడా ఇప్పుడు జ‌న‌బాహుళ్యంలో నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా ధృఢ సంక‌ల్పంతో సాగించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో జ‌గ‌న్ తెలుగు రాజ‌కీయాల్లో ఓ తిరుగులేని నేత‌గా ఆవిష్క‌రించార‌ని చెప్ప‌డంలో ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి లేద‌నే చెప్పాలి.


Full View

Tags:    

Similar News