జగన్...బాబు... పెద్ద బీసీ ఎవరు...?

Update: 2022-12-03 00:30 GMT
ఏపీలో ఎన్నికలు ఇంకా దూరంగా ఉన్నాయి కానీ కులాల పేరిట పేటెంట్లు హక్కులు మావంటే మావి అంటూ రాజకీయ కాట్లాట మొదలైపోయింది. యాభై శాతం పైగా ఓట్లు ఉన్న బీసీలను తమ వైపునకు తిప్పుకుంటే ఎన్నికల గోదారి సులువుగా ఈదేయవచ్చు అన్నదే రాజకీయ పార్టీల అధినాయకత్వాల ఆలోచన. అందుకే బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ అని దీనికి కొత్తగా పేరు పెట్టి మరీ బీసీలకు కేరాఫ్ అని జగన్ మూడున్నరేళ్ళుగా గట్టిగానే ట్రై చేస్తున్నారు.

ఆయన చాలానే పదవులు బీసీల పేరిట ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తం వార్డు మెంబర్ నుంచి మొదలుపెడితే నామినెటెడ్ పదవులతో పాటు మంత్రి పదవులు కలుపుకుని ఏకంగా 84 వేల మందికి అవకాశాలు ఇచ్చామని వైసీపీ పెద్ద చిట్టానే బయటకు తీసింది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఏపీలో 130 బీసీ కులాలను అరవై కార్పోరేషన్లుగా విభజించి కార్పోరేషన్లను ఏర్పాటు చేశామని కూడా పేర్కొంటోంది. ఇలా వీరందరినీ ఒక చోటకు చేర్చి ఈ నెల 7వ తేదీన విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం పేరుతో భారీ సభను నిర్వహిస్తోంది.

ఈ సభ ద్వారా వైసీపీకి టీడీపీని వెనక్కి నెట్టి దూకుడు చేయాలని చూస్తోంది. బీసీలకు తామే అతి పెద్ద అండ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. బీసీలకు మంత్రి పదవులలో సింహ భాగం ఇచ్చామని, రాజ్యసభ సభ్యులుగా పంపించామని, అనేక కీలకమైన స్థానాలలో వారిని ఎంపిక చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. దీనికి కౌంటర్ అన్నట్లుగా గోదావరి జిల్లాల టూర్ లోనే బాబు గట్టిగా ఇచ్చేశారు.

అన్ని పదవులూ తన సొంత సమాజికవర్గానికే కట్టబెట్టి బీసీలను వైసీపీ అధినేత జగన్ మభ్యపెడుతున్నారని చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు మీరు అంటూ ఒక జాబితాను చదివి ఏకి పారేశారు. ఇక బీసీలైన మాజీ మంత్రులు కూడా వరసబెట్టి వైసీపీ మీద దాడిని చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే జగన్ మోసపు రెడ్డి అని విమర్శించారు. బీసీల పేరు ఎత్తే హక్కు ఆయనకు లేనే లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు కన్న తల్లి అయితే వైసీపీ సవతి తల్లి అని అయ్యన్న ఒక పోలిక తెచ్చి ఎద్దేవా చేశారు. బీసీల నోరు నొక్కి వారికి తీరని అన్యాయం చేసిన జగన్ బీసీల పేరిట సభ జరిపే హక్కు కోల్పోయాడని కూడా నిందించారు.

అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ నుంచి నాయకులు స్పందిస్తున్నారు. రాజండ్రీ ఎంపీ భరత్ అయితే అగ్ర వర్ణాల వారికే పరిమితం అయిన రాజమండ్రీ సీటుని తనకు ఇచ్చి నిజమైన బీసీ బంధువుగా జగన్ నిలిచారు అని అన్నారు. పిల్లి శుబాష్ చంద్రబోస్ అయితే బీసీలకు తమ పార్టీ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో చర్చించేందుకు సిద్ధమని తెలుగుదేశానికి సవాల్ చేశారు. బీసీల తోకలు కత్తిరిస్తామని అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు గద్దించిన విషయం మరచిపోయారా అని వారు అంటున్నారు.

మొత్తానికి మా బాబే పెద్ద బీసీ అని టీడీపీ నేతలు అంటూంటే జగన్ కంటే అసలైన బీసీ ఎవరున్నారని ఆ పార్టీ వారు రివర్ లో అటాక్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బీసీలకు నిజమైన బంధువు ఎవరు అన్నదే చర్చ. ఏపీలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నా వారికి మంత్రి పదవులు ఇచ్చినా పూర్తి అధికారాలు ఏ ప్రభుత్వంలోనూ లేవని అంటున్నారు. అలాగే బీసీల నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎవరూ ఎదగకుండా చేశారని కూడా ఆక్రోసిస్తున్నారు. తమను కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారని, అసలైన రాజ్యాధికారం బీసీలకు ఉండాలన్నదే తమ డిమాండ్, అదే తమ పోరాటమని బీసీ నేతలు చెబుతున్నారు.

బీసీలు అంటే ఏకీకృతంగా చెప్పడానికి మాట వరకూ ఓకే కానీ ఒక కులం కాదు సకల కులాలూ అందులో ఉన్నాయి. దాంతో ఒకరితో ఒకరికి పొసగక వారంతా కేవలం పక్క వాయిద్యాలుగా మిగిలిపోతున్నారు అన్న బాధ ఆవేదన ఆ సమాజంలో ఉంది. అయితే దీన్ని అగ్ర కుల రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని,నోరున్న కొన్ని బీసీ కులాలకే పదవులు కట్టబెడుతూ బీసీ సంక్షేమం చేశామని బీరాలు పోతున్నారు అని అంటున్నారు.

బీసీలు ఐక్యంగా ఉంటేనే తప్ప రాజ్యాధికారం దక్కదని, బీసీల పెద్దగా వారి నుంచే ఉంటారు తప్ప వేరే వారు కానే కాదన్నది వారి మాట. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం బీసీల పెద్దగా తామే ఉండాలని బాబు జగన్ పోటీ పడుతున్న వేళ ఎవరిని బీసీలు దగ్గరకు తీస్తారో చూడాల్సిందే.
x

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News