అటు జగన్...ఇటు బాబు ...ప్రచారాలు ఆగవా...?

Update: 2022-08-24 03:30 GMT
ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే వాటి వెనక ఏముంది, ముందు ఏమి జరగబోతోంది అన్నది మాత్రం తలపండిన రాజకీయ పండితులకు అంతు పట్టడంలేదు. ముందుగా అమిత్ షా టూర్ లో కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. అవేంటో అందరికీ తెలిసిందే. మీడియా దిగ్గజం రామోజీరావుని కలవడానికి అమిత్ షా స్వయంగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడం అనూహ్య పరిణామమే.

అయితే అక్కడ నలభై అయిదు నిముషాల పాటు రామోజీరావు తో అమిత్ షా చర్చలు జరిపారు అని మాత్రమే బయటకు వచ్చింది మరి వారిద్దరూ ఏమేమి మాట్లాడుకున్నారు అంటే అది ఎవరికీ తెలియని విషయమే. ఎందుకంటే ఇది వన్ టూ వన్ భేటీ. ఇక అమిత్ షా రామోజీరావుల భేటీలో చంద్రబాబు కూడా ఉన్నారని మరో టాక్ నడిచింది. మరి అది జరిగిందా. జరిగితే బాబు ఉన్నట్లుగా ఫోటోలు ఎక్కడా రాలేదు ఎందుకు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది.

ఇక చంద్రబాబుతో చర్చలు అంటే దర్జాగా ఓపెన్ గా జరపవచ్చు. అంత రహస్యంగా ఎందుకు జరపాలి అన్నది కూడా మరో ప్రశ్న. అయితే దానికి జవాబు కూడా ఉంది. ఏపీలో వైసీపీ సర్కార్ ఉంది. వైసీపీ మద్దతు బీజేపీకి ఈ రోజున రాజ్యసభలో కావాలి. అయితే వచ్చే ఎన్నికలలో జగన్ తో పొత్తు ఉండదు, బీజేపీ అడగదు, అడిగినా ఆయన ఓకే చెప్పరు. దాంతో బీజేపీ ఎన్నికల ఆశలకు జగన్ తో కుదరదు.

అదే టైమ్ లో చంద్రబాబుతో కుదురుతుంది. అందువల్ల బీజేపీకి బాబు కావాలి, జగన్ కూడా కావాలి. అయితే బాబుతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఓపెన్ అయితే ఇప్పటికిపుడు జగన్ తో ఇబ్బంది వస్తుంది, రిలేషన్స్ చెడతాయని ఏమైనా అనుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో బాబుతో రహస్య భేటీ వేశారా అన్నది కూడా ఊహాగానంగా ఉన్న ప్రచారం. ఇందులో నిజమెంతో ఎవరికీ తెలియదు.

ఇక అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఉంటుంది అని టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి. నిప్పులేనిదే పొగ రాదు కాబట్టి వాటిని నమ్మవచ్చా అంటే నమ్మాలి. కానీ రామోజీరావు అమిత్ షా భేటీ తరువాత మాత్రం బాబు ఊసు లేదని తేలిపోయింది. మరి బాబు నిజంగా కలిసారా లేదా అన్నది ఈ రోజుకీ తెలియదు, కానీ కలిశారు సీక్రెట్ గా అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కూడా తెలియదు.  ఇది బాబు సైడ్ నుంచి ప్రచారం లో ఉన్న విషయం అయితే జగన్ వైపు నుంచి కూడా కొన్ని ప్రచారాలకు క్లారిటీ రావడంలేదు.

జగన్ షెడ్యూల్ లో లేని విధంగా సడెన్ గా ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నారు అన్నది కూడా ఒక చర్చగా ముందుకు వస్తోంది. దీనికి జవాబు అయితే అమిత్ షా రామోజీరావుని కలవడమే అని అంటున్నారు. రామోజీరావుని కూడా తన రాజకీయ ప్రత్యర్ధిగా జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతీ మీటింగులో దుష్ట చతుష్టయం అని ఈనాడుని రామోజీరావుని కలిపే విమర్శిస్తున్నారు.

ఆ విధంగా చూస్తే తన ప్రత్యర్ధులతో బీజేపీ చేతులు కలిపింది అని తెలుసుకునే జగన్ ఈ విషయం మోడీతో మాట్లాడడానికే ఢిల్లీ అర్జంటు గా వెళ్ళారని ప్రచారంలో ఉన్న విషయం. అంతే కాదు తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి దారుణ హత్య విషయంలో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుందని, ఆ తరువాత అనూహ్య పరిణామాలు జరుగుతాయని భావించే జగన్ ఢిల్లీ వెళ్లారని మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో నిజమెంతో   కూడా ఎవరికీ తెలియకపోయినా ప్రచారం మాత్రం ఉంది.

అలాగే తన మీద ఉన్న కేసుల విషయంలో విచారణ వేగం పుంజుకున్న నేపధ్యంలో ఆ విషయాలు మాట్లాడడానికే జగన్ వెళ్లారని కూడా ఇంకో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలు అన్నీ టీడీపీ వైపు నుంచి వస్తూంటే వైసీపీ వైపు నుంచి అనేక అనుమానాలు కలిగేలా ప్రచారాలు వస్తున్నాయి. బాబు అమిత్ షా కలిసే ఉంటారన్నదే ఆ ప్రచార సారాంశం. మొత్తానికి ఇందులో నిజాలు ఇప్పట్లో కాదు ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ ప్రచారం మాత్రం తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో అలాగే సాగుతున్నాయి. ఒక విధంగా ఈ ప్రచారాల నుంచి ఎవరి విశ్లేషణ వారు చేసుకునేలాగే అంతా ఉంది అంటున్నారు.
Tags:    

Similar News