40 ఏళ్ల అనుభవాన్ని జగన్ నలిపేసినట్లేనా?

Update: 2019-12-14 01:30 GMT
ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో సీఎం జగన్ తీరు చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తిరుగులేని అనుభవం ఉన్న చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడల ముందు నిలిచి జగన్ ఆయన్ను తట్టుకోగలరా అన్న అనుమానాలు అందరిలోనూ ఉండేవి. తొలి ఆర్నెల్లల్లో జగన్‌లో ఆ తడబాటు కనిపించింది కూడా. అయితే.. ఆర్నెళ్ల తరువాత జగన్‌ ఇప్పుడు చంద్రబాబును ఎదుర్కోవడమే కాదు పైచేయి సాధించినట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా జగన్ తన తండ్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి సభలో అనుసరించిన తీరు, ఎత్తులు, పైఎత్తులు, ప్రతిపక్షాలను నిలువరించినట్లుగా జగన్ సభను తన చేతుల్లోకి తీసుకోగలరా... శాసనసభను సమర్థవంతంగా నిర్వహించడం సభా నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సాధ్యమేనా? అన్న అనుమానాలు అందరిలో ఉండేవి. అందునా, మూడు సార్లు ముఖ్య మంత్రిగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెదేపా అధినేత చంద్ర బాబు వ్యూహాలను కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎలా ఎదుర్కొంటారని అంతా సందేహించారు. యువకుడు, ఆవేశపరుడు అయిన జగన్‌ని ఇరుకున పెట్టడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదని అందరూ అనుకున్నారు. అయితే, అందుకు పూర్తి భిన్నంగా పక్కా వ్యూహంతో సీఎం జగన్‌ తండ్రిని మరిపిస్తూ సభను నడిపిస్తున్నారని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పథకాల్లో నాడు-నేడు అంటూ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఇప్పుడు సభ్యులు సభలో నాడు-నేడు అంటూ సరిపోల్చుకుంటున్నారు. ఆయన తండ్రి హయాంలో సభ జరిగిన తీరు, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టిన వైనం ఇప్పుడు మళ్లి జగన్‌ కళ్లకు కట్టినట్లు చూపుతున్నారని ఆనాటి జ్ఞాపకాలను సీనియర్లు జ్ఞప్తికి తెచ్చుకుంటూ జూనియర్లకు చెబుతున్నారు.

ఈనెల 9వ తేదీన ప్రారంభమైన సభ గురువారం నాటికి నాలుగు రోజులు పూర్తిచేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో చంద్రబాబు ఎత్తులను చిత్తుచేస్తూ.. ఆయన వాదనల్లో పస లేదనే విషయాన్ని ప్రజలకు ఉదాహరణలతో సోదాహరణంగా వివరించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి తమ కళ్లముందు కనిపించినట్లుందని సభ్యులు చర్చించుకున్నారు. ఉల్లి ధరలు, ఆంగ్ల మాధ్యం, మహిళా రక్షణపై బిల్లు తదితర అంశాల్లో చంద్రబాబును రాజీనామా చేయగలరా అంటూ సవాల్‌ విసిరి ఇరుకున పెట్టడాన్ని ప్రస్తావిస్తున్నారు.

సభలో తొలి రోజు ఉల్లి ధరలపై విపక్ష సభ్యులు గొడవ చేశారు. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని చివర్లో సీఎం జగన్‌ కూలంకుశంగా వివరిస్తూ ప్రతిపక్ష ఆందోళనకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు మహిళల రక్షణకు సంబంధించి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే ఉల్లి లొల్లి ఏంటంటూ రాజకీయ విమర్శలుచేస్తూనే దేశంలోనే ఏ రాష్ట్రం సబ్సిడీపై ఉల్లిని సరఫరా చేసిన దాఖలాలు లేవంటూ అటు విపక్ష సభ్యులకు, ఇటు ప్రజలకు ఉదాహరణలతో కూలంకుశంగా వివరించి విపక్ష నేతల నోళ్లు మూయించారు.

రెండో రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ అనుసరించిన వ్యూహం తలపండిన నేతలనూ ఆశ్చర్యపరిచింది. మంగళవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే ఎవరూ ఊహించని విధంగా వంశీమోహన్‌ చేయి ఎత్తడం, స్పీకర్‌ అయనకు అవకాశం కల్పించడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. వల్లభనేని వంశీ వైకాపాలో చేరతారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని భావించారు. ఉప ఎన్నిక అనివార్యం కాకుండానే వంశీ మోహన్‌తోనే తాను తెదేపాలో ఇమడలేనని, తనను స్వతంత్య్ర అభ్యర్ధిగా గుర్తించాలని చెప్పించడంలో సీఎం జగన్‌ తన చాణక్యాన్ని ప్రదర్శించారు.

మూడో రోజు కూడా తెదేపా వ్యూహాన్ని పక్కా ప్రణాళికతో తిప్పికొట్టారు. చంద్రబాబు, తెలుగుదేశం సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు, ప్రతి ఆరోపణకు సీఎం ఎంతో పరిణతి చెందిన నేతగా సమాధానం చెప్పుకొచ్చారు. నామినేటెడ్‌ పదవులు అన్నీ రెడ్డి సామాజికవర్గానికే ఇస్తున్నారంటూ తెదేపా ఆరోపణచేసి అధికార పక్షాన్ని ఇరుకునపెట్టాలని భావించింది. ఆ ఆరోపణ చేసిన 10 నిమిషాల కాల వ్యవధిలోనే సీఎం జగన్‌ నామినేటెడ్‌ పోస్టుల జాబితాను సభలో చదివి వినిపించారు. చంద్రబాబు అత్తగారైన నందమూరి లక్ష్మీ పార్వతికి ఆయన హయాంలో పదవి అనేది ఇవ్వకుండా అవమానిస్తే తమ పాలనలో ఆమెను తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలిగా నియమించామంటూ ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు.

నాలుగో రోజు కూడా ఇంగ్లీషు మాద్యంపై ఆయన చంద్రబాబును నిలదీశారు. తాను గతంలో ఎన్నడూ ఇంగ్లీషు బోధనను వ్యతిరేకించలేదని, పాత రికార్డులు తిరగేసి సరిచూసుకోవాలని చెబుతూనే అలా లేకుపోతే రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. ఈ తరుణంలోనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా సీఎం జగన్‌ అంతే స్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబును నిలవరించడంతో జగన్‌ పూర్తి స్థాయిలో విజయం సాధించారు. కొన మెరుపు ఏంటంటే మొన్నటి వరకూ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించిన తెదేపాతోనే తాము వ్యతిరేకం కాదని చెప్పించగలిగారు. హెరిటేజ్‌ సంస్థకు సంబంధించి కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తూనే తాను చెప్పిన అంశాలు వాస్తవం కాదని తేలితే రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. దానిపై సీఎం జగన్‌ తనదైన శైలిలో స్పందించారు. హెరిటేజ్‌ అమ్ముకున్నప్పటికీ దానిలో 3.5 శాతం వాటా తమరికి లేదని చెప్పగలరా అంటూ ఆధారాలు బయటపెట్టి చంద్రబాబును నిలువరించారు.

మొత్తానికి జగన్ ఆర్నెళ్ల పాలన తరువాత ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు ఈ సమావేశాలు అద్దం పడుతున్నాయి.
Tags:    

Similar News