వేలెత్తి చూపే వారికి మరో పంచ్ విసిరిన జగన్!

Update: 2020-05-10 04:25 GMT
ప్రత్యర్థులకు అదే పనిగా బీపీ తెచ్చే పనులు చేయటం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటుగా మారింది. గతానికి భిన్నంగా రాజకీయ ప్రత్యర్థులకు ఎర వేసినట్లే వేసి.. ముగ్గులోకి లాగి.. వారికి దిమ్మ తిరిగిపోయేలా షాకులిచ్చే తీరు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా.. ఇలాంటి షాకే తన ప్రత్యర్థులకు మరొకటి ఇచ్చారు సీఎం జగన్.

మద్యం దుకాణాల్ని తిరిగి ఓపెన్ చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే. ఎన్నికల వేళలో సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ పెద్ద మాటలు చెప్పిన జగన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఎవరిళ్లల్లో వారు ఉంటున్న ప్రత్యేక పరిస్థితుల్లో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని మరికొంత కాలం ఎందుకు అమలు చేయట్లేదంటూ తప్పు పట్టినోళ్లు లేకపోలేదు.

జగన్ మాటలకు చేతలకు మధ్యనున్న తేడాను చెప్పేస్తూ.. డిఫెన్సులో పడేసే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నేతలు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఏపీ సర్కారు శనివారం సాయంత్రం ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మద్య నియంత్రణకు తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 566 షాపుల్ని తొలగిస్తున్నట్లుగా పేర్కొంది. మద్య నిషేధం మీద జగన్ సర్కారుకు కమిట్ మెంట్ లేదంటూ ఫైర్ అయిన వారంతా తాజా నిర్ణయంతో మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటివరకూ మద్యనిషేధం మీద జగన్ గతంలో ఇచ్చిన హామీల్ని అదే పనిగా ప్రస్తావించే వారంతా ఇప్పుడు చేష్టలుడిగిపోయే పరిస్థితి. నిజానికి జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో ఉన్న 4380 మద్యం దుకాణాలకు 3500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా 13 శాతం తగ్గించటంతో.. తాము పవర్లోకి వచ్చిన తర్వాత మొత్తం షాపుల్లో 33 శాతాన్ని తగ్గించిన ఘనత జగన్ సర్కారు ఖాతాలో పడినట్లైంది. షాపుల్ని తగ్గించటం ద్వారా ప్రత్యర్థులపై అధిక్యతను సంపాదించటం ఒక ఎత్తు అయితే.. షాపులు తగ్గటం వల్ల అమ్మకాల మీద ప్రభావం ఎంతమాత్రం పడే అవకాశం ఉండదంటున్నారు.

ఎందుకంటే.. ఒక ఊళ్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు పది కాస్తా ఎనిమిది అయితే.. నష్టమేంటి? నాలుగు అడుగులు వేసేటోళ్లు పది అడుగులు వేస్తారంతే. కానీ.. ప్రభుత్వం వరకూ వచ్చే ప్రయోజనం మాత్రం ఎక్కువ. మద్యం షాపుల్ని తగ్గించిన ఘనతతో పాటు.. అమ్మకాల్లో ఎలాంటి తేడా రాదంటున్నారు. ఇదంతా చూసినప్పుడు ప్రత్యర్థులకు ఎర వేసి మరీ.. పంచ్ వేస్తున్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News