జగన్ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్న పోలీసులు.. ఇప్పటికైనా సీఎం గుర్తిస్తారా?

Update: 2022-11-23 03:53 GMT
ఏ ముఖ్యమంత్రి కూడా తాను ఏదైనా ఊరికి వెళుతున్న వేళ.. యుద్ధ వాతావరణం.. కర్ప్యూ వాతావరణంతో నిండి ఉండాలని కోరుకోడు. అందునా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ముఖ్యమంత్రి అయిన నాయకుడు.. సీఎం అయ్యాక తన తీరును మార్చుకోవాలని అనుకోరు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే.. ఆయన పతనానికి ఆయనే పునాది వేసుకున్నట్లు అవుతుంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే.. తాను పర్యటించే ప్రాంతాల విషయంలో ఆయన మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. తాను పర్యటించే ప్రాంతాల్లోని ప్రజలకు చుక్కలు చూపించేలా చేస్తున్న పోలీసుల తీరును ఆయన అత్యవసరంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. తాను ఏదైనా ఊరికి వెళ్లటానికి కొన్ని గంటల ముందు నుంచే ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోవటం.. ప్రధాన రహదారిలో బారికేడ్లు కట్టటం.. షాపుల్ని మూయించేయటం.. రోడ్లు మొత్తం ఖాళీగా ఉంచటం లాంటివి చేస్తున్నారు.

ఇంత హడావుడి ఎందుకు? ప్రజలకు చిరాకు కలిగించేలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం అడిగితే వచ్చే మాట.. ఎక్కడా ఎలాంటి నిరసన తలెత్తకూడదని. అనూహ్య ఘటనలు చోటు చేసుకోకూడదని. జాగ్రత్తలు తీసుకోవటం తప్పు కాదు. కానీ.. అతి జాగ్రత్తలతో అభాసుపాలు కాకూడదు కదా? ఈ విషయాన్ని జగన్ కు అర్థమయ్యేలా ఆయన సన్నిహితులు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే.. జగనే గుర్తించాల్సిన అవసరం ఉంది. విపక్ష నేతగా ఉన్నన్ని రోజులు తాను ప్రజల్లోకి ఇట్టే వెళ్లటంతో పాటు.. వారి మనిషిగా ఫీలయ్యేలా చేసేవారు. నిజానికి అదే ఆయనకు కలిసి వచ్చేలా చేసింది.

ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఉంటున్నాయి. సీఎం జగన్ వస్తున్నారంటే చాలు.. హడావుడి పీక్స్ కు చేరటమే కాదు.. ఆయన రావటానికి మూడు నాలుగు గంటల ముందు నుంచే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట లో జరిగే జగనన్న భూ సర్వే.. భూరక్ష పథకం రెండో దశ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా రోడ్ల మీద పోలీసులు చేసిన పనులకు ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

దీనికి తోడు డిగ్రీ విద్యార్థులకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్ హాల్ కు వెళ్లేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో ఉన్న కూరగాయల దుకాణాల్ని రెండు రోజుల ముందు నుంచే తొలగించారు. సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ పేరుతో ట్రాఫిక్ ను పలుమార్లు ఆపటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఇలా.. తమ ఊరికి ముఖ్యమంత్ర  రావటం ఏమో కానీ.. పోలీసుల తీరుతో ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇలాంటివి చోటు చేసుకుంటే పోలీసుల తీరుపై ప్రజల్లో పెరిగే చిరాకు.. చివరకు ముఖ్యమంత్రి మీదకు వెళ్లటం ఖాయం. అందుకే.. తాను పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించే తీరుపై జగన్ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే జరగకుంటే.. పోలీసుల తీరు కారణంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నది మరచిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News