జగన్ కొత్త ఆలోచన..అన్ని శాఖల్లోనూ నవరత్నాలు

Update: 2019-06-14 17:01 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు. రాజకీయాల్లో తల పండిన నేతల కంటే కూడా మెరుగైన రీతిలో వ్యవహరిస్తున్న జగన్... తనను జనం ఎల్లకాలం గుర్తుంచుకునేలా నడుచుకుంటున్నారు. పాలనలో తనదైన మార్కుకు ఆరాట పడుతున్న జగన్... మొన్న సచివాలయంలోని తన చాంబర్ లో ప్రవేశించిన సందర్భంగా జగన్ అందరినీ ఆశ్చర్చ చకితులను చేశారు. జగన్ చాంబర్ లో ఎంటరయ్యే వారికి ముందుగా ఆయన కలవరిస్తున్న నవరత్నాలే స్వాగతం పలుకుతున్నాయి. నవరత్నాలకు సంబంధించిన లోగోలను తన చాంబర్ గోడలపై వరుసగా అంటించేసిన జగన్... నిత్యం అవి తనకు గుర్తుకు వచ్చేలానే ఏర్పాటు చేసుకున్నారని చెప్పాలి.

అయితే తాను అనుకుంటున్నట్లుగా తన మదిలో రూపుదిద్దుకున్న నవరత్నాలు ప్రజలందరికీ చేరాలంటే... తానొక్కడే కల గంటే సరిపోదని భావించిన జగన్... ఇప్పుడు సరికొత్త ఆలోచన చేశారు. ఈ ఆలోచన ప్రకారం నవరత్నాలకు సంబంధించిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రభుత్వంలోని ప్రతి శాఖకూ పంపేందుకు నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా ఆయా శాఖలు నవరత్నాలపై సమగ్ర అవగాహనతో ఉంటాయని - ప్రజలకు మరింత మేర లబ్ధి చేకూరుతుందన్నది జగన్ భావన. దాదాపుగా నవరత్నాలతోనే రూపొందిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకు తాను ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నానన్న విషయాన్ని ఈ చర్య ద్వారా జగన్ అన్ని శాఖలకు - ఆ శాఖల్లోని ఉద్యోగులకు తెలియజేయాలని భావిస్తున్నారట. ఇలా అన్ని శాఖలకు వైసీపీ మేనిఫెస్టో చేరితే... జగన్ చాంబర్ లోనే కాకుండా ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ నవరత్నాల చిత్రాలు దర్శనమిస్తాయన్న మాట.

ఎన్నికల సందర్భంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన వైసీపీ మేనిఫెస్టోను తాను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నానని చెప్పుకుంటూ వస్తున్న జగన్.... ఈ మాటను ఏకంగా గవర్నర్ నరసింహన్ నోట కూడా పలికించేశారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్ - ఖురాన్ - భగవద్గీత మాదిరిగా చూస్తోందని - నవరత్నాలను ప్రజలందరికీ చేర్చడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా జగన్ అంతిమ లక్ష్యం నవరత్నాలను సంపూర్ణంగా అమలు చేయడమేనని ఆయన చర్యలను బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News