స‌ర్కారు డెసిష‌న్‌.. వైసీపీకి 9 జిల్లాలు ఫ‌ట్‌!

Update: 2021-11-24 12:30 GMT
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అధికారంలోకి రాగానే మడ‌మ తిప్పిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీదికి తెచ్చారు. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని.. అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని అంటూ.. కొత్త‌పాట పాడారు. వీటి కోసం ఆద‌రాబాద‌ర‌గా క‌మిటీలు వేయ‌డం.. ఉప‌సంఘాల‌ను నియ‌మించ‌డం.. అసెంబ్లీలో తీర్మానాలు చేయ‌డం .. అన్నీ తొలి ఏడాదిలోనే జ‌రిగిపోయాయి.

ఇక‌, ఈ బిల్లుల‌ను వ్య‌తిరేకించిన మండ‌లిని సైతం ర‌ద్దు చేస్తూ.. తీర్మానం చేశారు. అయితే.. జ‌గ‌న్ ఇంత అట్ట‌హాసంగా తీసుకువ‌చ్చిన మూడురాజ‌ధానుల బిల్లుపై.. ఏయే న‌గ‌రాల‌ను వికేంద్రీక‌ర‌ణ పేరుతో అభివృద్ది చేయాల‌ని తాను సంక‌ల్పించారో.. ఆయా న‌గ‌రాల నుంచి రియాక్ష‌న్ రాలేదు.

పైగా.. అమ‌రావ‌తి కోసం 33 వేల ఎక‌రాల భూమిని ఇచ్చామంటూ.. రైత‌న్న‌ల నుంచి ఉద్య‌మం ప్రారంభ‌మైంది. ఇది ఇంకా ర‌గులుతూ.. సెగ‌లు.. పొగ‌లు క‌క్కుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి రైతులు, మ‌హిళ‌ల మ‌హాపాద‌యాత్ర కొన‌సాగుతోంది.

క‌ట్ చేస్తే.. తాజాగా అమ‌రావ‌తి బిల్లుల‌పై హైకోర్టు చేప‌ట్టిన విచార‌ణ‌లో సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌బుత్వం నుంచి స‌మాధానాలు క‌నిపించ‌డం లేదు. ఎన్ని చెబుతున్నా.. కీల‌క విష‌యాల‌పై మాత్రం దాట‌వేత‌తోనే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు రోజువారీ విచార‌ణ చేప‌ట్టడం.. మ‌రోవైపు.. రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం.. వంటి ప‌రిణామాలు.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఇక్క‌డ చిత్ర‌మేంటంటే.. జ‌గ‌న్ పేర్కొన్న విశాఖ‌, క‌ర్నూలు నుంచి మాకు ఆయా రాజ‌ధానులు కావాలంటూ.. ఎవ‌రూ రోడ్డెక్క‌లేదు.

కానీ, సెల్ఫ్ గోల్ వేసుకున్న జ‌గ‌న్‌.. అసెంబ్లీలో.. రెండు రోజుల కింద‌ట‌.. మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నామ ని.. త్వ‌ర‌లోనే స‌మ‌గ్ర‌మైన బిల్లును ప్ర‌వేశ పెడ‌తామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. తాము అబివృద్ధి వికేంద్రీక‌రిస్తామ‌నే ఆశ‌తోనే ప్ర‌జ‌లు త‌మ‌కు భారీ మెజారిటీ ఇచ్చి అధికారం క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు.

అంటే.. ప్ర‌జ‌లు మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఉన్నార‌ని.. చెప్పుకొచ్చారు. ఇక‌, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మ‌రో మాట చెప్పారు. అస‌లు.. మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారు... కేవ‌లం 3 శాతం మాత్ర‌మేన‌ని.. మిగిలిన 97 శాతం మంది ప్ర‌జ‌లు.. కూడా జ‌గ‌న్ తీసుకున్న మూడుకు.. మురిసిపోతున్నార‌ని.. మురిపెంగా ఉన్నార‌ని.. చెప్పుకొచ్చారు.

దీంతో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లు రాష్ట్ర భౌగోళిక‌, రాజ‌కీయ, ప్ర‌జ‌ల జీవ‌న శైలి దృష్ట్యా చూస్తే.. మొత్తం 13 జిల్లాల ప్ర‌జ‌లు ఈ మూడు రాజ‌ధానుల‌పై ఎలా ఆలోచిస్తున్నారు? అనే చ‌ర్చ వ‌స్తోంది. ఇదేంటో చూద్దాం. మొత్తం 13 జిల్లాల్లో.. రాజ‌ధాని జిల్లాలుగా గుంటూరు, కృష్ణా జిల్లాలు గుర్తింపు పొందాయి.

మ‌రి మిగిలిన జిల్లాల్లో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించిన వెంట‌నే.. ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేదు.. ఆనంద తాండ‌వాలు చేయ‌లేదు. పైగా.. అమ‌రావ‌తికి ఎంతో ఖ‌ర్చు చేశారు కదా.. ఇప్పుడేంటి ఇలా? అని బుగ్గ‌లు నొక్కుకున్నారు. ఇక‌, జిల్లాల వారీగా చూస్తే..

ఉత్త‌రాంధ్ర‌:

ఇక్క‌డ మూడు జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం. గ‌త 2019 ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం, విజ‌య‌నగ‌రం ప్ర‌జ‌లు జ‌గ‌న్ వెంట‌న‌డిచారు. కానీ, వారు రాజ‌ధానిపై ఉన్న దృష్టితో కాదు. వెనుక‌బ‌డి జిల్లాల్లో ముందువ‌రుస‌లో ఉన్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌జ‌లు.. కూలి నాలి చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌పై వారు ఆశ‌లు పెట్టుకున్నారు. దీంతో ఇక్క‌డ రాజ‌ధానిపై దృష్టి క‌న్నా.. త‌మ‌కు అంతో ఇంతో ప్ర‌భుత్వం నుంచి భ‌రోసా వ‌స్తుంద‌నే దృష్టితోనే జ‌గ‌న్‌కు ఓట్లేశారు. సో.. ఇక్క‌డ‌.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు రాజ‌ధాని ఫీలింగ్ ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా ఇప్పుడు వీరికి న‌మ్మ‌కం పోయింది. ఇక్క‌డ నిర్మాణ రంగం కూలీలు..ఎక్కువ‌. ఇప్పుడు రియ‌ల్ రంగం దెబ్బ‌తింది. దీంతో ఇక్క‌డ జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం పోయింది.

పైగా మూడు రాజ‌ధానులు వ‌చ్చినా.. ముప్పై రాజ‌ధానులు వ‌చ్చినా.. మాకు ప‌నిక‌ల్పిస్తే.. చాల‌నే ధోర‌ణితో ఉన్నారు. దీంతో రాజ‌ధాని ఎఫెక్ట్ ఇక్క‌డ‌లేదు. ఇక‌, విశాఖ ప‌ట్నం చూసుకుంటే.. 2014, 2019లో విశాఖ వాళ్లు జ‌గ‌న్‌ను న‌మ్మ‌లేదు. ఆయ‌నను డిస్ట్ర‌క్ట‌ర్గానే న‌మ్ముతున్నారు.

దీంతో ఇక్క‌డ కీల‌క‌మైన నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ త‌ర‌ఫున‌ న‌లుగురు గెలిచారు. పోనీ.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామ‌ని చెప్పాకైనా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారా? అంటే.. లేదు. పైగా.. క‌డ‌ప రాజ‌కీయాలు.. సీమ ఫ్యాక్ష‌న్లు పెరిగిపోతాయ‌ని.. త‌మ భూముల‌ను క‌బ్జాచేస్తార‌ని.. ఇక్క‌డి వారు బెంబేలెత్తుతున్నారు. దీనిని బ‌ట్టి ఉత్త‌రాంధ్ర‌లో జ‌గ‌న్ చెబుతున్న రాజ‌ధాని సెంటిమెంటు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాలు:

ప‌శ్చిమ‌, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ రాజ‌ధాని మార్పు.. విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డంపై పెద్ద‌గా ఊపు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇక్క‌డి వారికి అటు అమ‌రావ‌తి అయినా.. ఇటు విశాఖ అయినా.. ఒకే దూరం. పైగా.. హైద‌రాబాద్‌లోనూ ఇక్క‌డి వారు చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు.

దీంతో అమ‌రావ‌తి క‌నుక రాజ‌ధానిగా ఉంటే.. ఇక్క‌డ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. నిజానికి అమ‌రావ‌తి అయితేనే బాగుంటుంద‌ని.. ఇక్క‌డి వారు బావిస్తున్నారు. ఎందుంటే.. ఉభ‌య గోదావ‌రుల‌కు విజ‌య‌వాడ‌, గుంటూరుతో అనుభంధం ఎక్కువ‌. పైగా ఇటు ప్ర‌యాణ మార్గాలు, కమ్యూనికేష‌న్స్ ఎక్కువ. సో.. ఈ రెండు జిల్లాల్లోనూ.. అమ‌రావ‌తికే జైకొడుతున్న ప‌రిస్థితి ఉంది.

కృష్ణా-గుంటూరు:
ఈ రెండు జిల్లాలు ఎలానూ.. రాజ‌ధానిగా జిల్లాలుగా ప్ర‌చారంలో ఉండ‌డం.. ఇప్ప‌టికే ఎయిమ్స్ వంటి వైద్య సంస్థ‌లు ఏర్పాటు కావ‌డం వంటివి.. ఇక్క‌డి ప్ర‌జ‌లు వ‌దులుకునే ప‌రిస్థితిలేద‌నే ధోర‌ణితోనే ఉన్నారు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ మూడు మంత్రాన్ని ఇక్క‌డివారు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. శాస‌న రాజ‌ధానిగా చూస్తామ‌ని.. త‌మ‌కు అమ‌రావ‌తిపై ప్రేమ ఉంద‌ని.. అంటున్నా.. దీనిలో ఎక్క‌డో `క‌ప‌టం` ఉంద‌నే వాద‌నే వినిపిస్తోంది. సో.. ఇక్క‌డ కూడా వైసీపీకి వ‌చ్చే ల‌బ్ధి ఏమీ లేదు.

చిత్తూరు-అనంత‌రం:

చిత్తూరు ప్ర‌జ‌ల‌కు మిన్ను విరిగి మీద‌ప‌డుతున్నా.. ప‌ట్ట‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి. ఇక్క‌డి వారికి ఏదో వ్యాపారం జ‌రిగిపోయి.. రోజులు గ‌డిస్తే..చాలులే అనుకుంటారు. సో.. వీరికి కూడా మూడు రాజ‌ధానులైనా.. ముప్పై రాజ‌ధానులైనా.. త‌మ‌కు ఒరిగేది లేనప్పుడు.. ఈ రాజ‌కీయ వివాదంలో వేలెందుకు పెట్టాలి? అమ‌రావ‌తి రైతుల‌కు ఎందుకు.. అడ్డు ప‌డాలి? అనే ధోర‌ణి క‌నిపిస్తోంది దీంతో వీరు కూడా మూడుకు జై కొట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇక‌, అనంత‌పురం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ త‌మ‌కు సాగు, తాగు నీరు.. ఉపాధి క‌ల్పిస్తే.. చాల‌నే ప్ర‌జ‌లే 85 శాతం మంది ఉన్నారు. వ‌ల‌స‌లు లేని జీవితాలు చూసేందుకు వారు ఇష్ట‌ప‌డుతున్నారు త‌ప్ప‌.. మూడు రాజ‌ధానుల‌కు జైకొడ‌దాం.. మాకేదో ఒరుగుతుంద‌ని వారు అనుకోవ‌డం లేదు. అస‌లు.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు.. మూడు ముచ్చ‌ట అనంతలో ఎక్క‌డా వినిపించ‌డ‌మూ లేదు. సో.. ఇక్క‌డా జ‌గ‌న్‌కు నిరాశే వ్య‌క్తం కానుంది.

ప్ర‌కాశం-నెల్లూరు:

నెల్లూరు వాళ్ల‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని అయితే..ద‌గ్గ‌ర‌గా ఉంటుందనే భావ‌న స‌ర్వ‌త్రా వుంది. ఎందుకంటే ఒక్క జిల్లా దాటితే.. రాజ‌ధాని. పైగా.. ఇక్క‌డ కూడా అభివృద్ది జ‌రుగుతుంది. ఈ ఆలోచ‌న‌లో వారు ఉన్నారు. కాబ‌ట్టి మూడుకోసం.. మూడు మార్చుకునే ఉద్దేశం ఇక్క‌డి వారికి లేదు. పైగా అమ‌రావ‌తి రైతుల సెంటిమెంటును వారు బాగా గౌర‌విస్తున్నారు. ఒక‌వేళ రెడ్డి సెంటిమెంటు ఉన్నా.. స్థానికంగా ప్ర‌జ‌ల‌ను కాద‌ని వారు ఎలాంటి నిర్ణ‌యాన్నీ ప్ర‌క‌టించ‌లేరు.

ఈ నేప‌థ్యంలోనే మ‌హామ‌హా మేధావులు, నాయ‌కులు ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కు మ‌ద్ద‌తుగా ఏ ఒక్క‌రూ మాట్లాడ‌లేదు. ఇక‌, . ప్ర‌కాశం పూర్తిగా అమ‌రావ‌తికే జైకొడుతోంది. ఇటీవ‌ల మ‌హాపాద‌యాత్ర‌కు .. పోలీసుల‌ను ఎదిరించి మ‌రీ.. ఇక్క‌డి వారు రైతుల‌కు పూల ప‌ల్ల‌కీ ప‌ట్టారు. సో.. వారు మూడు స‌సేమిరా అంటున్నారు. ఇది వైసీపీకి డేంజ‌ర్ బెల్ మోగిస్తోంది.

క‌డ‌ప-క‌ర్నూలు:

క‌డ‌ప సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా. సో.. ఆయ‌న ఏం చేసినా.. జై కొట్టే వారు ఇక్క‌డ ఉన్నారు. దీంతో .. ఇక్క‌డ ఆయ‌న తీసుకునే నిర్ణ‌యానికి మార్కులు ప‌డ‌తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని వ‌స్తుంద‌ని అంటున్నారు క‌నుక‌.. ఎప్పటి నుంచో ఉన్న డిమాండే కాబ‌ట్టి.. ఇక్క‌డి ప్ర‌జ‌లు.. దీనికి మొగ్గు చూపుతున్నారు. అంటే.. ఈ రెండు జిల్లాల్లోనే జ‌గ‌న్‌కు అనుకూల ప‌రిస్థితి.. వైసీపీకి సానుకూల ప‌రిస్థితి క‌నిపిస్తున్నాయి.

ఎక్క‌డెక్క‌డ ఎలా?

రాష్ట్రంలో ప్ర‌జ‌ల మ‌నోభావాలు.. భౌగోళిక ప‌రిస్థితులు. వ్యాపార అవ‌స‌రాలు.. వంటివాటిని సంపూర్ణంగా అన్ని కోణాల్లోనూ జ‌ల్లెడ ప‌డితే.. మూడు రాజ‌ధానుల‌పై జిల్లాల ప‌రిస్థితి ఇదీ..

మూడు రాజ‌ధానుల‌కు
జై కొట్టే జిల్లాలు: క‌డ‌ప‌, కర్నూలు(2)
ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్న జిల్లాలు: ఉభ‌య గోదావ‌రులు(2)
త‌ట‌స్థంగా ఉన్న జిల్లాలు: నెల్లూరు, చిత్తూరు(2)
మాకెందుక‌నుకునే జిల్లాలు: శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం(3)
నై కొట్టే జిల్లాలు: గుంటూరు, కృష్ణా, ప్ర‌కాశం, విశాఖ‌(4)

కొస‌మెరుపు: ఏదేమైనా.. అమ‌రావ‌తే బెట‌ర్ అంటున్న జిల్లాలు మొత్తం 9




Tags:    

Similar News