సచివాలయాలపై జగన్ కీలక నిర్ణయం

Update: 2021-03-29 05:10 GMT
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్న సీఎం జగన్ ‘సచివాలయ వ్యవస్థ’తో పరిపాలనను ప్రజలకు చేరువ చేశాడు. తాజాగా అదే ఊపులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సచివాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పంచాయతీల్లో తమకు అధికారాలు ఉంటాయని భావించిన కొత్త సర్పంచ్ లకు జగన్ ఓ రకంగా షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో అధికారం చెలాయిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇకపై ఆ పని చేయలేరు. రెవెన్యూశాఖ పరిధిలోకి వచ్చే వీఆర్వో - ఎమ్మార్వో - ఆర్డీవోలకే కీలక అధికారాలు కట్టబెట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు భారీ షాక్ ఇచ్చారు జగన్.

గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు ఉండగా.. ఇప్పుడు ఆ అధికారాన్ని వీఆర్వోలకు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.

ఏపీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు జీతభత్యాల నుంచి అన్ని అధికారాలను స్థానిక వీఆర్వోలకు కట్టబెడుతూ గ్రామ సచివాలయాల శాఖ తాజాగా జీవో నంబర్ 2 జారీ చేసింది. దీంతో సచివాలయాల్లో ఇప్పటివరకు అధికారం చెలాయించిన పంచాయతీ కార్యదర్శులు ఇక నామమాత్రంగా మారిపోయారు. ఇక తమ శాఖ రెవెన్యూ పరిధిలో ఉన్న వీఆర్వోలతో నడుస్తుందనేలా సచివాలయాల శాఖ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

తాజాగా సచివాలయాల డీడీవో అధికారాలు ఎవరికి ఉండాలన్న అంశంపై ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఉద్యోగులు అన్ని పథకాల మీద పట్టు ఉండి.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డిజిటల్ అసిస్టెంట్ కు ఇస్తే బావుంటుందని ఎక్కువగా సూచించారు.

మరికొందరు పంచాయతీ కార్యదర్శకులకే ఈ అధికారం ఇవ్వాలని కోరారు. ఇంకొందరు వీఆర్వోకు డీడీవో అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పారు. చివరకు ప్రభుత్వం వీఆర్వోలకే డీడీవో అధికారాలు కట్టబెట్టింది.

ఇక గ్రామ సచివాలయాలపై వీఆర్వోలకు పెత్తనం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. సచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన కార్యదర్శులంతా ఉన్నత విద్యావంతులు. కానీ వీఆర్వోలంతా ఇంటర్ లోపు వారే. ప్రమోషన్లతో ఎదిగిన వారు. ఇప్పుడు వారికే అందలం దక్కనుంది.

ఇక పంచాయతీరాజ్ శాఖలోని అందరు అధికారులు, సెక్రటరీ నుంచి ఉన్నతాధికారి వరకు ఇక ఉత్సవ విగ్రహాలుగా మారిపోనున్నారు.
Tags:    

Similar News