బాబు ఇచ్చే ‘ఓటుకు రేటు’.. ఫిక్స్ చేసిన జగన్!

Update: 2018-02-05 04:08 GMT
ఇవాళ్టి రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు సంగతిగా మారింది. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడం మాత్రమే కాదు.. రాజ్యసభ ఎంపీ వంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లను కూడా కొనుక్కోవడానికి ఓ రేటు కట్టి బరితెగించడానికి పాల్పడినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓటుకు డబ్బులివ్వడం అనేది ఇంత విస్తృతంగా ప్రజల్లో నానిపోయిన తర్వాత.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారం కోసం హోరాహోరీ పోరాడే నాయకులు ఇబ్బడిముబ్బడిగా డబ్బులు పంచుతారని ప్రజలు అనుకోవడంలో వింతేమీ లేదు.

అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన పార్టీ అభ్యర్థుల తరఫున 2019 ఎన్నికల్లో ప్రజలకు ఒక్కొక్క ఓటుకు ఎంత సొమ్ము ఇవ్వబోతున్నారు. ఇలాంటి ఊహాగానాలు కష్టమే కానీ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం..  ఆ రేటును తాను అంచనా వేసి ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ రూపాల్లో అవినీతికి పాల్పడడం ద్వారా చంద్రబాబునాయుడు లక్షల కోట్లు దాచి ఉంచారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 3000 రూపాయల వంతున వెలకట్టి కొనడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్.. చంద్రబాబునాయుడు ప్రతి ఓటుకు 3000 ఇవ్వబోతున్నారు. ఆ సొమ్ము తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ఎలా చెబితే అలా వేయండి. డబ్బుకు అమ్ముడు పోవద్దు.. అలాగని చంద్రబాబు వద్ద తీసుకోకుండానూ ఉండొద్దు. చంద్రబాబు వద్ద ఉన్నదంతా అవినీతి సొమ్మే.. అది ప్రజల సొమ్మే.. ఆ సొమ్ము మీద మీకు హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ మనసు చెప్పినట్లుగా వేయండి.. అని జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇస్తున్నారు.

పాదయాత్రలో ముందుకు సాగుతున్న కొద్దీ జగన్ ధోరణిలో కొంత మార్పు కూడా కనిపిస్తున్నట్లుగా ఉంది.  నన్ను సీఎం చేయండి.. అంటూ యాత్ర ప్రారంభించిన జగన్  కాస్తా.. ఇప్పటికి.. మీ మనస్సాక్షి చెప్పినట్లుగా ఓట్లు వేయండి అనే దశకు వచ్చారంటే.. ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణను ఆయన గ్రహించినట్లుగా ఉన్నదని... తనకు అనుకూలంగా సంకేతాలున్నాయని భావిస్తున్నట్లున్నదని పలువురు అనుకుంటున్నారు.

Tags:    

Similar News