జగన్ మిక్సింగ్ నెగిటివ్ రిజల్ట్.. భారీ నిరసన సెగలు

Update: 2022-04-11 04:36 GMT
అందుకే అంటారు.. మనసులో ఎలాంటి శంకలు లేకుండా.. స్వేచ్ఛగా.. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఎప్పుడైతే అలా చేస్తే ఏమవుతుందో? ఇలా చేస్తే ఇంకేమవుతుందో అన్న అనుమానం వచ్చిందంటేనే లెక్కలో ఏదో తేడా వచ్చిందనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల వేళలో టికెట్లను ఫైనల్ చేయటానికి పట్టిన సమయం చాలా తక్కువగా చెబుతారు. అంతేకాదు.. చారిత్రక విజయం అనంతరం కొలువు తీరే ప్రభుత్వంలో మంత్రలుగా ఎవరికి ఎంపిక చేయాలన్న దానిపైనా సింపుల్ గా లెక్క తేల్చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

క్లిష్టమైన మంత్రివర్గ సభ్యుల ఎంపికను సులువుగా తేల్చేసిన ఆయన.. తిరుమల తిరుపతి దేవస్తానం బోర్డు సభ్యుల ఎంపిక కోసం ఆయన భారీ కసరత్తును చేయాల్సి వచ్చింది. అంతకుమించి.. తాజా కేబినెట్ కోసం ఆయన పడిన తర్జనభర్జన అంతా ఇంతా కాదని చెప్పాలి.

రోజుల తరబడి కసరత్తు చేయటం.. పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ముందుగా చెప్పినట్లే ఆదివారం మధ్యాహ్నానానికి జాబితా విడుదలైంది. ఇంతలా కసరత్తు చేసిన తర్వాత విడుదలైన జాబితాను చూసినోళ్లు విస్మయానికి గురవుతున్నారు. పలు జిల్లాలకు.. పలు సామాజిక వర్గాలకు ఏ మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వకుండా లిస్టు ఫైనల్ చేసిన తీరుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గడిచిన మూడేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో వైసీపీ వర్గాలు తమ నిరసనను అస్సలు దాచుకోలేదు. రోడ్ల మధ్యలో టైర్లు తగలబెట్టటం.. ద్విచక్ర వాహనాల్ని కాల్చేయటం మొదలు.. రాస్తారోకోలు.. ధర్నాలు.. ఆందోళనలు.. ఏడుపులు.. పెడబొబ్బలు ఇలాంటివెన్నో చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు ఓపెన్ గా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా అవకాశం లభించకపోవటమా? అంటూ నిర్వేదం వ్యక్తం చేసినోళ్లు ఉన్నారు.

ఓవైపు పదవులు రాని ఎమ్మెల్యే తీవ్ర వేదనతో ఉండగా.. వారి అనుచర వర్గం చెలరేగిపోయింది. వారిని ఎంతలా వారిస్తున్నా ఊరుకోకుండా మండిపడుతున్నారు. తమ నాయకుడికి అన్యాయం చేస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామాలు చేస్తామన్న మాట వినిపించటం గమనార్హం.

మరోవైపు.. మంత్రి పదవులు రాకున్నా పార్టీని వీడేది లేదంటూ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. పదవులు ఆశించిన రాని పలు జిల్లాల్లో వైసీపీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదంతా చూసినప్పుడు ఎంతో కసరత్తు చేసిన కేబినెట్ వంటకం ఓకే అయినా.. రుచి దగ్గర మాత్రం తేడా కొట్టేసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News