తిట్టే బాబుకు.. పొగిడే జగన్ కు తేడా ఇదే..

Update: 2019-10-30 07:57 GMT
చంద్రబాబుకు.. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి ఇద్దరి మధ్య పాలనా పరంగా ఉండే వ్యత్యాసం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాల్ని పలువురు చెబుతారు. నాలుగు నెలల వ్యవధిలోనే తనదైన మార్క్ వేసిన జగన్.. అందరిని కలుపుకు వెళ్లటమే కాదు.. తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న దర్పాన్ని ప్రదర్శించటం ఉండదంటారు. సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ లనే కాదు.. కీలక అధికారులు పలువురితో కలివిడిగా ఉండటం.. సీఎం అన్న డాబు ప్రదర్శించకుండా.. వారితో కలిసి తినటం.. మాట్లాడటం చేస్తుంటారు.

పని చేయనప్పుడు ఆగ్రహాం వ్యక్తం చేయటం ఎంత కామనో.. పని మంచిగా చేసినప్పుడు బాగా చేశారన్న ప్రశంస కూడా చాలా అవసరం. బాబులో తిట్టటమే కానీ.. పని బాగా చేశారన్న ప్రశంస అస్సలు కనిపించదు. అలాంటివి తన విషయంలో దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్. తాజాగా తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలు చేస్తున్న రైతుభరోసా స్కీంను అమలు చేసి.. రైతులకు డబ్బులు పంచే విషయంలో మిగిలిన కలెక్టర్ల కంటే మిన్నగా నిలవటమే కాదు.. కరవు రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేశారు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్. సత్యానారాయణ.

తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ లలో ఒకటైన రైతుభరోసా స్కీంను అనంతపురం జిల్లా కలెక్టర్ చక్కగా నిర్వహించటమేకాదు.. 4.81లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుభరోసా కింద ఏకంగా రూ.390 కోట్లు జమ చేసిన వైనం ముఖ్యమంత్రి జగన్ గుర్తించారు.

వ్యవసాయ శాఖ.. రెవెన్యూ.. బ్యాంకర్ల సహకారంతో ఆయనీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయటాన్ని జగన్ ప్రశంసించారు. సంక్షేమ పథకాల్ని అర్హులకు అందేలా అందరూ అనంతపురం జిల్లా కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని కృషి చేయాలన్నారు. ఈ తీరు అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని రగిలించటమే కాదు.. పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News