జ‌గ‌న్ దెబ్బ‌!..బాబుకు మేనిఫెస్టో గుర్తుకొచ్చింది!

Update: 2018-06-26 08:23 GMT
మేనిఫెస్టో... ఏ రాజ‌కీయ పార్టీకి అయినా - రాజ‌కీయ నేత‌కు అయినా చాలా ముఖ్య‌మైన‌దే. ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు త‌మ‌కు ఎందుకు అధికారం ఇవ్వాలో - త‌మ‌కే ఓటు ఎందుకు వేయాలో కూడా చెబుతూ... త‌మ‌కు ఓటేసి గెలిపిస్తే ఏమేం చేస్తామ‌న్న విష‌యాల‌ను ఆయా రాజ‌కీయ పార్టీల‌తో పాటు నేత‌లు కూడా ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్రధాన‌మైన అంశాల కూడికే మేనిఫెస్టో. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి లాంటి నేత‌లు ఈ మేనిఫెస్టోను త‌మ క‌ర్త‌వ్యంగా భావించిన వైనం మ‌న‌కు ఇంకా మ‌రిచిపోలేని విష‌య‌మే. తాను ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు మేనిఫెస్టోలో ప్రస్తావించిన హామీల‌న్నింటినీ నెర‌వేర్చ‌డ‌మే కాకుండా... హామీ ఇవ్వ‌ని స‌రికొత్త సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా ప‌ట్టాలెక్కించిన వైఎస్ జ‌నం మదిలో చిర‌స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు నేల‌లో సంక్షేమ పాల‌న‌ను కొత్త పుంత‌లు తొక్కించిన వైఎస్ త‌న‌యుడిగా... వైసీపీ అధినేత‌ - ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా తండ్రి మాదిరే మేనిఫెస్టోపై ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న నేత‌గానే చెప్పుకోవాలి. ఎందుకంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇత‌ర రాజ‌కీయ పార్టీలు - నేత‌ల మాదిరిగా రైతుల‌కు రుణాలు మాఫీ చేసేస్తామ‌ని ఊర‌కే మాట చెప్పేసి... ఓట్లు వేయించుకుని ఆ త‌ర్వాత రుణ‌మాఫీని మ‌రిచిపోలేన‌ని చెప్పిన జ‌గ‌న్ రుణ‌మాఫీ అంశాన్ని ప్ర‌స్తావించ‌డానికి స‌సేమిరా అన్నారు. ఈ  విష‌యంపై సొంత పార్టీ నేత‌లు చాలా సార్లు చెప్పినా కూడా సాధ్యం కాని హామీల‌ను మేనిఫెస్టోలో పెట్టి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేన‌ని వారి ముఖం మీదే చెప్పి... మేనిఫెస్టో అంటే ఎంత‌టి ప్రాముఖ్య‌మైన‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న ఇట్టే చెప్పేశారు.

అయితే అందుకు భిన్నంగా ముందుకు సాగిన టీడీపీ అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా ఇబ్బడిముబ్బ‌డిగా హామీలు ఇచ్చేసింది. రాష్ట్రంలో రుణ‌మాఫీని పూర్తిగా అమ‌లు చేస్తామ‌ని - అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వారి వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌డ‌మే కాకుండా.... ఆయా స‌మ‌స్య‌ల‌ను ఇట్టే ప‌రిష్క‌రించేస్తామ‌ని కూడా నారా చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలోని ఆ పార్టీ లెక్క‌కు మిక్కిలి పేజీల‌తో మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. స‌ద‌రు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను ఎన్నిక‌ల‌య్యే దాకా ఊద‌ర‌గొట్టేసిన టీడీపీ అధికారం ద‌క్క‌గానే దానిని అట‌కెక్కించేసింది. మేనిఫెస్టోను ఎందుకోస‌మైతే విడుద‌ల చేసిందో... ఆ  కార్యం సిద్ధించింది క‌దా... ఇక మేనిఫెస్టోతో ఇంకేం ప‌ని ఉంది అన్న‌ట్టుగా భావించిన చంద్ర‌బాబు నిజంగానే ఎన్నిక‌ల‌కు ముందు విడుద‌ల చేసిన మేనిఫెస్టోను నిజంగానే మ‌రిచిపోయారు. ఈ క్ర‌మంలో మొన్నామ‌ధ్య త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన మాటను ఏం చేశారంటూ దేవాల‌యాల్లో ప‌నిచేసే నాయీ బ్ర‌హ్మ‌ణులు చంద్ర‌బాబును నిల‌దీయ‌డానికి వ‌చ్చిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యారు. నాయీ బ్రాహ్మణుల‌పై అంతెత్తున ఎగిరిప‌డ్డారు. అసలు వారు చెబుతున్న విష‌యాన్ని వినేందుకు కూడా చంద్ర‌బాబు స‌సేమిరా అన్నారు. త‌న‌నే ఆపేస్తారా? అంటూ చిందులు తొక్కారు. చంద్ర‌బాబు ఆగ్ర‌హం చూసిన నాయీ బ్రాహ్మ‌ణులు షాక్ తిన్నారు. ఎంతైనా సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి అంత‌గా కోప్ప‌డితే... సైలెంట్‌ గా ఉండిపోవ‌డం మిన‌హా చేసేదేముంటుంది చెప్పండి. నాయీ బ్రాహ్మ‌ణుల ప‌రిస్థితి కూడా అదే మారిదిగా త‌యారైంది.

అయితే చంద్ర‌బాబు త‌న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలు ఇప్ప‌టికీ నెర‌వేర‌లేద‌న్న విష‌యాన్ని చాలా విస్ప‌ష్టంగా చెబుతూ వ‌స్తున్న జ‌గ‌న్‌... నాయీ బ్రాహ్మ‌ణులపై చంద్ర‌బాబు చిందులేసిన వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ బాబుకు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. ఆల‌యాల్లో క్షుర‌కులుగా ప‌నిచేస్తున్న నాయీ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని బ‌య‌ట‌కు తీసిన జ‌గ‌న్‌.... చేత కాన‌ప్పుడు ఆ హామీ ఎందుకు ఇచ్చార‌ని బాబు అండ్ కోను నిల‌దీశారు. అంతేకాకుండా త‌న ప‌రివారం చేత రాయించిన చంద్ర‌బాబుకు అస‌లు నాయీ బ్రాహ్మ‌ణుల‌కు ఏం హామీ ఇచ్చాన‌న్న విష‌యాన్ని గుర్తు చేయ‌డంతో పాటుగా స‌ద‌రు హామీ టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలో ఉందో కూడా జ‌గ‌న్ చాలా విస్పష్టంగానే చెప్పేశారు. అంతేకాకుండా ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల చిట్టా... మేనిఫెస్టో క‌నీసం గుర్తు ఉందా? అంటూ చంద్ర‌బాబును క‌డిగిపారేశారు. జ‌గ‌న్ కొట్టిన ఈ దెబ్బ బాబుకు కాస్తంత గ‌ట్టిగానే త‌గిలిన‌ట్టుంది.

అప్ప‌టిదాకా... అంటే తాను సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత ఈ నాలుగేళ్ల‌లో ఒక్క‌సారి కూడా మేనిఫెస్టో మాట‌ను ప‌ల‌క‌ని చంద్ర‌బాబు... జ‌గ‌న్ దెబ్బ‌కు ఇప్పుడు మేనిఫెస్టో జ‌పం చేయ‌క త‌ప్ప‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల చిట్టా అయిన మేనిఫెస్టోను మ‌రిచిపోయే నేత‌లు చాలా మందే ఉన్నా... ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌తో పాటు ఇవ్వ‌ని హామీల‌ను కూడా నెర‌వేర్చామ‌ని నిత్యం చెప్పుకునే బాబు అండ్ కో... మేనిఫెస్టో మాట జ‌గ‌న్ చెబితే గానీ గుర్తుకు రాక‌పోవ‌డం నిజంగానే విడ్డూరంగా ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మాట‌కొస్తే... 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే బాబు... త‌న‌కంటే వ‌య‌సులో చాలా చిన్న‌వాడైన జ‌గ‌న్ ప్ర‌స్తావించిన త‌ర్వాత గానీ త‌న మేనిఫెస్టో గుర్తుకు రాక‌పోవ‌డం నిజంగానే విడ్డూర‌మే మ‌రి. అయినా రాజ‌కీయ నేత అన్న త‌ర్వాత తాను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌తో పాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు ఇచ్చిన హామీల జాబితాపైనా కనీస అవ‌గాహ‌న అయినా ఉండాలి. ఈ విష‌యంలో బాబు బాగా తేలిపోగా... విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ సత్తా చాట‌డ‌మే కాకుండా టీడీపీ మేనిఫెస్టోను పేజీల‌తో స‌హా బాబుకు గుర్తు చేసి సత్తా చాటార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News