20 నిమిషాల్లో అన్నీ నిరూపిస్తాన‌న్న జ‌గ‌న్‌

Update: 2017-03-24 13:38 GMT
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఏపీ అసెంబ్లీ రెండో రోజు సైతం  దద్దరిల్లింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆధారాలతో సహా చూపిస్తామంటే ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ అధినేత‌, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 20 నిమిషాల సమయం ఇస్తే ఆధారాలతో సహా చూపిస్తామని  ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జ్యుడిషియల్‌ ఎంక్వైరీని వైయస్‌ ఆర్‌ సీపీ డిమాండ్‌ చేస్తే టీడీపీ సభ్యులు వాళ్లేదో ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. 20 నిమిషాలు అవకాశం ఇస్తే సాక్షాధారాలతో సహా సభకు చూపిస్తా.. ఒక వేళ మైక్‌ ఇవ్వకపోతే.. ఆధారాలతో సహా ప్రెస్‌ ముందుకు వెళతానని జగన్ అన్నారు.

అగ్రిగోల్డ్ భూముల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగింది నిజ‌మ‌ని జ‌గ‌న్ స‌భ‌లో పున‌రుద్ఘాటించారు. మంత్రి పుల్లారావు కొన్న భూములపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ కోరింది తామేనని, ఆరోపణలను నిరూపించే అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. తనకు కొద్దిపాటి సమయం ఇస్తే తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ సభ ముందు ఉంచుతానని వైఎస్ జగన్ పదే పదే కోరినా అందుకు స్పీకర్ అంగీకరించలేదు. జగన్ ఒక‌వైపు మాట్లాడుతుండగానే మధ్యలో మంత్రులు యనమల రామకృష్ణుడు - పైడికొండల మాణిక్యాలరావు తదితరులు అడ్డుకుని తమదైన రీతిలో ఎదురుదాడికి దిగారు. జగన్ వద్ద ఉన్న ఆధారాలన్నీ బోగస్ పేపర్లని, వాటితో ఆయన ఈ కేసును నిరూపించలేరని యనమల అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై రెండు రోజులు సభాసమయాన్ని వృథా చేశారన్నారు. అనంతరం ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ సుదీర్ఘంగా చదివారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News