అర్జెంటుగా అమరావతికి వచ్చేస్తానంటున్న జగన్

Update: 2017-03-26 06:48 GMT
దిగితే కానీ లోతు తెలియదు.. తింటే కానీ రుచి తెలియదు అంటారు. వైసీపీ అధినేత జగన్ కు కూడా ఇప్పుడు అమరావతి  కేంద్రంగా రాజకీయం చేస్తే ఎన్ని బెనిఫిట్సు ఉన్నాయన్నది అర్థమైందట. ఇంతకాలం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను వదిలి రాని ఆయన కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాల వల్ల అమరావతిలో ఉండడం వల్ల అనేక అంశాలను గమనించారు. అంతేకాదు... లోకల్ గా ఉంటే ప్రజల నుంచి స్పందన మరింత ఎక్కువగా ఉందనీ గుర్తించారట.
    
ఇప్ప‌టి వ‌ర‌కూ వైసిపి కార్య‌క‌లాపాల‌న్నీ హైద‌రాబాద్‌ లోని లోటాస్‌ పాండ్ నుంచే సాగుతున్నాయి. వైసీపీ నుంచి రాష్ట్రస్థాయి నాయ‌కుడు ఎవ‌రు మాట్లాడాల‌న్నా లోటాస్‌ పాండే వేదిక. కానీ మిగతా పార్టీల రాష్ట్ర కార్యాల‌యాల‌న్నీ విజ‌య‌వాడ‌ - గుంటూరుకు త‌ర‌లి వ‌చ్చాయి.  వైసిపి మాత్రం ఇంకా రాష్ట్ర కార్యాల‌యాన్ని హైదరాబాద్‌ లోనే ఉంచింది. దీనిపై ఇప్ప‌టికే ఆపార్టీలోని నేత‌లు జ‌గ‌న్‌ కు ప‌లుసార్లు సూచించినా ఆయన పెద్ద‌గా స్పందించ‌లేదు.  తాజాగా ఆయన ఇక్కడి స్వీయ అనుభవాలతో ఆయన ఆలోచన మారిందని.. అర్జెంటు విజయవాడకు షిఫ్టు కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
    
విజ‌య‌వాడ‌లో రోజూ క‌నీసం మూడు, నాలుగు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. ప్ర‌భుత్వంపై విసుగుచెందిన వారు, ప్ర‌జావ్య‌తిరేక అంశాల‌ను నిర‌సించేవారు విజ‌య‌వాడ కేంద్రంగా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. నిత్యం ఇవ‌న్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడే ఉంటే అవకాశాన్ని బట్టి వారితో కలవొచ్చు. గ‌డ‌చిన రెండుమూడు రోజులుగా జ‌గ‌న్ అగ్రిగోల్డు బాధితుల పోరాటం - విఆర్ ఎల పోరాటాలను ద‌గ్గ‌ర ఉండి గ‌మ‌నించారు. వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి సంఘీభావం తెలిపారు. వారి నుంచి వ‌చ్చిన స్పంద‌న గ‌మ‌నించారు. దీనిపై వివిధ వ‌ర్గాల నుంచి స‌మాచారం సేక‌రించారు. దీంతో విజ‌య‌వాడ‌లో ఉండ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి పెంచొచ్చని ఆయన గుర్తించారు.   రెండు - మూడు కార్యక్ర‌మాల‌కు హాజ‌ర‌యితేనే పార్టీకి ఆశించిన దానికంటే ఎక్కువ మైలేజి వ‌చ్చింది. నిత్యం ఇక్క‌డే ఉంటే దీని ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది అని ఆయ‌న గ‌మ‌నించారు. దీంతో వీలైనంత త్వరగా పార్టీ రాష్ర్ట కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News