ఓటమి అంచున జగన్ చెల్లెమ్మ...?

Update: 2023-03-12 19:00 GMT
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుపాం సీటు వైసీపీకి కంచుకోటగా మారింది. అక్కడ 2014, 2019లో వరస విజయాలు వైసీపీకి దక్కాయి. అలాంటి  సీటు ఇపుడు చేజారుతోంది అంటే ఆలోచించాల్సిందే. ఇక రెండు సార్లూ ఇదే సీటు నుంచి గెలిచి 2019లో వైసీపీ తరఫున తొలి క్యాబినేట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పాముల పుష్ప శ్రీవాణికి 2024 ఎన్నికల గండం పొంచి ఉందని అంటున్నారు. జగన్ కి ముద్దుల చెల్లెలుగా ముద్ర పడిన పుష్ప శ్రీవాణిని రాజకీయ అదృష్టవంతురాలిగా చెబుతారు.

ఆమె పిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం, ఏకంగా డిప్యూటీ సీఎం లాంటి పదవిని పొందడం అంటే రికార్డుగానే చూస్తారు. అయితే ఆమెకు కురుపాం వైసీపీ కంచుకోట ఈసారి చేదు ఫలితాన్ని ఇస్తుందని శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఎ ఎస్ గ్రూప్ ) సర్వే  వెల్లడిస్తోంది. కురుపాం లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ 2024లో ఉంటుందని, అయితే పుష్ప శ్రీవాణి 2.5 శాతం ఓట్ల ఆధిక్యతతో ప్రస్తుతానికి ఎడ్జిలో ఉన్నారని సర్వే చెబుతోంది.

కానీ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తేనే ఈ విధంగా వచ్చిందని, అదే ఆ రెండు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీ కి వచ్చిన 2.5 శాతం ఆధిక్యతను అధిగమించి విజయ పరంపర కొనసాగించడం ఖాయమని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా పుష్పవాణి పనితీరు మీద కూడా విమర్శలు ఉన్నాయి.

ఆమెకు కీలకమైన శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా సరైన తీరున వ్యవహరించలేకపోయారు అన్న ఆరోపణలు సైతం  ఉన్నాయి. అదే టైం లో వర్గ పోరు కూడా నెమ్మదిగా రాజుకుంటోంది. ఇంకో వైపు సొంత కుటుంబం నుంచి ఆడపడుచు ఈసారి టీడీపీ తరఫున పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు శ్రీవాణికి స్వయంగా మరదలు అవుతారు. ఆమె పేరు పల్లవీరాజు. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె.

ఆమెను పోటీకి పెట్టి టికెట్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఆమె పెదనాన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తమ మొత్తం బలాన్ని కూడా ఉపయోగించి ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించడానికి చూస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు గతంలో ఉన్న వైసీపీ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అభ్యర్ధుల పనితీరే ప్రమాణంగా రేపటి ఎన్నికలు జరుగుతాయని తేలడంతో వైసీపీ కంచుకోట మంచుకోటగా మారుతుందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

ఇక చూస్తే వైసీపీ సొంత సర్వేలలో కూడా ఈ సీటు మీద డౌట్లు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది. మరి అభ్యర్ధిని మార్చి రిపేర్లు చేసుకుని గెలుపు బాటన నడుస్తారా లేక వేరే విధంగా గెలుపు వ్యూహాలు రచిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కురుపాం వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని   సర్వే మాత్రం గట్టిగానే చెప్పేసింది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News