తనకూ చెప్పులు..చీపుర్లు చూపించొచ్చంటున్నాడు

Update: 2016-06-15 05:05 GMT
ఏ వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు.. ఆగ్రహావేశాల్ని చవి చూశారో.. అదే వ్యాఖ్యల్ని మరోసారి చేశారు ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రతికూలంగా కంటే అనుకూలంగా మారాయని చెప్పొచ్చు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పులు.. చీపుర్లు చూపించాలంటూ ఆ మధ్య ఘాటు విమర్శలు చేయటం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు మరీ అంత దూకుడుతనం పనికిరాదంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటల్ని తప్పు పట్టారు కూడా. అయినప్పటికీ.. తన మాటలపై జగన్ వెనక్కి తగ్గలేదు. తాజాగా బెజవాడలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆయన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా.. నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుందన్న ఆయన.. నాయకులు మోసగిస్తే ప్రజలు చీపుర్లు.. చెప్పులు చూపిస్తారనే స్థాయి రావాలన్నారు. ఇది రాజకీయ నాయకులందరికి వర్తించాలంటూ కొత్త తరహా రాజకీయానికి తెర తీశారు. అబద్ధాలు ఆడిన ఎవరికైనా చెప్పులు.. చీపుర్లు చూపించాలని.. రేపొద్దున తనకైనా ఇది వర్తిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యర్థులపై విరుచుకుపడటం మాత్రమే చేసే జగన్.. అందుకు భిన్నంగా తాను తప్పుచేసినా చీపుర్లు.. చెప్పులు చూపించమంటున్న నేపథ్యంలో.. ఈసారి ఆయన మాటల్ని ఎవరూ తప్పు పట్టరేమో?
Tags:    

Similar News