ఆంధ్రోళ్లు ఎంత‌గా మోస‌పోయారో తెలిసేలా జ‌గ‌న్ లెక్క‌

Update: 2017-10-11 05:38 GMT
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌ధాని హోదాలో ఉన్న మ‌న్మోహ‌న్ సింగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదాను క‌ల్పిస్తామ‌న్న మాట‌ను చెప్ప‌టం తెలిసిందే. దాన్ని మోడీ అండ్ కో ఎలా ట్విస్ట్ చేసింది? ఏపీని ఎంత‌గా నష్ట‌పోయేలా చేశారో తెలిసిందే. అయితే.. ఆంధ్రా పాల‌కుల చేత‌కానిత‌నం..మోడీని ప్ర‌శ్నించ‌లేని కార‌ణంగా కోట్లాది ఆంద్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని తాక‌ట్టు పెట్టార‌ని చెప్పాలి.

ప్ర‌త్యేక హోదాపై స‌మ‌ర‌శంఖం ఊదిన ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ‌లో వివ‌రంగా మాట్లాడారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా హోదాకు సంబంధించిన ఒక కీల‌క‌మైన లెక్క‌ను చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ చెప్పిన లెక్క వింటే.. హోదా మిస్ కావ‌టం వ‌ల్ల ఏపీకి జ‌రిగిన ఆర్థిక న‌ష్టం ఏస్థాయిలో ఉంటుందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పాలి.

హోదా ఇవ్వ‌ని కార‌ణంగా ఆంధ్రోళ్లు ఎంత‌గా నష్ట‌పోయార‌న్న విష‌యాన్ని అటు మీడియా కానీ.. ఇటు అధికార‌ప‌క్షం కానీ నోరు విప్పి మాట్లాడింది లేదు. ఇలాంటివేళ‌.. హోదా కోసం ఇప్ప‌టికే ద‌శ‌ల వారీగా పోరాడిన జ‌గ‌న్‌.. తాజాగా అనంత‌పురంలో హోదాపై కేంద్రం తీరును నిర‌సిస్తూ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర లెక్క‌ను చెప్పుకొచ్చారు. ఏపీకి హోదా లేని కార‌ణంగా జ‌రిగే న‌ష్టాన్ని గ‌ణాంకాల‌తో స‌హా చెప్పుకు రావ‌టం గ‌మ‌నార్హం.

హోదాపై మోడీ స‌ర్కారు హ్యాండ్ ఇవ్వ‌టం కార‌ణంగా ఏపీకి ఎంత మేర నిధుల న‌ష్టం వాటిల్లింద‌న్న మాట‌ను జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి జ‌గ‌న్ ఏం మాట్లాడారు? ఆయ‌నేం చెప్పార‌న్న విష‌యాన్ని ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+ "ఇవాల్టికీ 11 రాష్ట్రాలకు హోదా ఉందనేది నిజం. మనకు మాత్రం ప్రత్యేక హోదా రాలేదు.. ఆ మేరకు ప్యాకేజీ రాలేదనేది నిజం. పార్లమెంట్‌ సాక్షిగా 2017 ఏప్రిల్‌ లో వివేక్‌ గుప్తా ఓ ప్రశ్న (4393) వేశారు. కేంద్రం నుంచి ఏటా ఏ మేరకు రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు..? మూడేళ్ల వివరాలు చెప్పండి? అని అడిగారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది"

+ "11 రాష్ట్రాలకు హోదా ఉంద‌ని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో జనాభా 7.5 కోట్లు. దేశ జనాభా 121 కోట్లు. అంటే దేశ జనాభాలో 11 రాష్ట్రాల జనాభా 6.2 శాతం ఉంది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,42,745 కోట్లు ఇస్తే, 11 రాష్ట్రాలకు రూ.1,32,582 కోట్లు ఇచ్చారు. అంటే 6.2 శాతం జనాభా ఉన్న 11 రాష్ట్రాలకు 14.06 శాతం నిధులు ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర జనాభా 4.93 కోట్లు. అంటే 4.08 శాతం నిధులు అందాయన్న మాట‌"

+  "ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రూ.44,747 కోట్లు మాత్రమే ఇచ్చారు. హోదా ఉండి ఉంటే ఈ నిష్పత్తి మేరకు రూ.86,686 కోట్లు వచ్చేవి. ఆంధ్రకు ఈ నిష్పత్తి ఎందుకు వర్తించలేదనేందుకు కారణం హోదా లేకపోవడమే. ఈ క్రమంలో ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చంద్రబాబు ఏరకంగా చెప్పగలుగుతున్నాడో అర్థం కావడం లేదు"

+  "ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలి అనేందుకు ఫార్మూలాలు లేవు. హోదా కలిగిన రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా కేటాయించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా అయిపోయిన అంశమని తేలిగ్గా తీసుకుంటున్నారు. మరి నిధుల కేటాయింపుల్లో ఇంత తేడా ఎలా ఉంది? అని ప్రశ్నిస్తున్నా. ఉద్యోగాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు"
Tags:    

Similar News