మొండితనం వదిలిపెడితే ఏమవుతుంది జగన్?

Update: 2015-12-18 08:11 GMT
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్నిసార్లు మాట్లాడే మాటల్లో పాయింట్ ఉంటుంది. కానీ.. ఆయన తన మొండివైఖరితో తనకు లభించే అవకాశాన్ని చేజార్చుకుంటారు. అంబేడ్కర్ మీద చర్చ జరిపిన తర్వాత కాల్ మనీ వ్యవహారం మీద సభలో చర్చించుకుందామని ఏపీ అధికారపక్షం ఓకే అన్నా.. మొదట కాల్ మనీ గురించి మాత్రమే చర్చ జరగాలంటూ పట్టుబట్టటం తెలిసేందే. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. సభ నుంచి విపక్ష సభ్యులంతా సస్పెన్షన్ అయ్యే వరకు వెళ్లింది. గురువారం మొదలైన ఏపీ శీతాకాల సమావేశాలు ఒకే ఒక్క పాయింట్ తో ఆందోళనలు జరగటం గమనార్హం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు సజావుగా జరగటం లేదన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే.. నవ్వు రాక మానదు. మొదట ఏపీ అధికారపక్ష వాదనను పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 జయంతి సందర్భంగా శీతాకాల సమావేశాల్లో తొలుత ఆయన గురించి చర్చ జరిపి.. ఆ తర్వాత కాల్ మనీ వ్యవహారం మీద చర్చకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఇక్కడ అధికారపక్ష వాదనను తప్పు పట్టాలంటే ఒక్క విషయమే కనిపిస్తుంది. అప్పుడెప్పుడో అంబేడ్కర్ జయంతి జరిగితే.. ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ జరుపుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. నిజంగా అంబేడ్కర్ మీద అధికారపక్షానికి అంత అభిమానమే ఉంటే.. రాజ్యాంగాన్ని రచించటం పూర్తి చేసిన రోజున అంటే.. నవంబరు 26న ప్రత్యేకంగా ఏపీ అసెంబ్లీని సమావేశ పరిచి ఆ చారిత్రక రోజునాడే చర్చ జరిపితే బాగుండేది కదా..?

అన్నీ ఆలోచనలు అందరికి రావాలని లేదనుకుందాం. అందుకే నవంబరు 26న చేయని పనిని.. తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేద్దామనుకున్నారని అనుకుందాం. దాన్ని తప్పు పట్టటం ఎందుకు? కాల్ మనీ మీద చర్చ జరగాలన్నది విపక్ష నేత జగన్ ఆలోచనే అయితే.. అధికారపక్షం కోరినట్లుగా అంబేడ్కర్ మీద చర్చ జరిపితే జగన్ కు వచ్చే నష్టం ఏమిటి? గురు.. శుక్రవారాలు నిరసనలతో విలువైన సభాకాలం పోయింది. ఇప్పుడు సభలో విపక్షం లేకుండానే అంబేడ్కర్ మీద చర్చ జరుగుతుంది. కాస్తంత సంయమనంతో ఆలోచించి.. హుందాగా వ్యవహరించి.. ఏపీ అధికారపక్షం చెప్పిన విధంగా అంబేడ్కర్ మీద చర్చను ముగించి.. ఆ తర్వాత కూడా కాల్ మనీ మీద ఏపీ అధికారపక్షం కాని చర్చకు నో అంటే..జగన్ చేసిన ఆందోళనకు అర్థం ఉండేది.

అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండా.. తాను కోరుకున్నదే జరగాలన్న మొండితనం విపక్ష నాయకుడిగా జగన్ కు ఉండటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. నిజానికి తన వాదనతో ఏపీ సర్కారును ఇబ్బంది పెట్టటమే జగన్ లక్ష్యమైతే.. అందుకు తగ్గట్లు తాను కాస్త తగ్గి.. కాల్ మనీ చర్చ సందర్భంగా నిప్పులు చెరిగితే బాగుండేది. అదేమీ లేకుండా తాను అనుకున్నదే జరగాలన్న ధోరణి జగన్ కు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలకు కూడా మంచిది కాదు. విపక్ష నేతగా జగన్ తన మొండితనాన్ని కాస్త విడిచిపెడితే బాగుంటుందేమో.
Tags:    

Similar News