చంద్రబాబుకు సిగ్గు లేదు-జగన్

Update: 2016-02-01 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సిగ్గు లేదని.. ఆయన దిగజారి మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. నిన్నటి ‘తుని’ ఘటనపై చంద్రబాబు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్ర స్థాయిలో దిగజారి మాట్లాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ చంద్రబాబు లాగా దిగజారి మాట్లాడి ఉండరని అన్నాడు. జగన్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘తునిలో జరిగిన సంఘటనకు సంబంధించి నిన్నటి చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే చాలా ఆశ్చర్యమేసింది. ఆయన తప్పులు చేస్తాడు. వేరే వాళ్ల మీద అభాండాలు వేస్తాడు. నిన్నటి ప్రెస్ మీట్లో చంద్రబాబు రకరకాల ఆరోపణలు చేశాడు. నేను కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నానని.. తుని ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ హస్తం ఉందని.. ఆరు మీడియా ఛానెళ్లకు మాత్రమే ఈ ఘటన గురించి ముందే ఎలా తెలిసిందని. సీపీఎం సహా వేరే పార్టీలు కూడా కుట్ర చేశాయని.. మేం పట్టిసీమకు, రాయలసీమకు, అమరావతికి వ్యతిరేకమని అన్నారు. నన్ను నేరస్థుడు, క్రిమినల్ అన్నారు. అవినీతి గురించి మాట్లాడారు.

నిన్నటి మీటింగుకి కాపులు 5-10 శాతం మంది మాత్రమే హాజరయ్యారని అన్నాడు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడానికి బీసీలు ఒప్పుకోవట్లేదని అన్నాడు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితే లేదని.. అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదన్నాడు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం వేసిన కమిషన్ ఒప్పుకోకుంటే ఏం చేయలేం అన్నాడు. ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. అంతసేపు మాట్లాడిన చంద్రబాబు.. కాపులకు ఏం చేస్తాం ఎప్పుడు చేస్తాం అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు తాను తప్పు చేస్తాడు. ఆ తప్పులు బయటికి రాకుండా చూసుకోవడానికి అవతలివాళ్ల మీద అబద్ధాలు, అభాండాలు వేస్తున్నాడు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన విషయాల గురించి అడిగితే కాపుల మీద ఇలా అభాండాలు వేస్తాడా? కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత వ్యవధిలోనే బీసీలకు నష్టం జరక్కుండా సమస్య పరిష్కరిస్తాం అని.. కాపుల కోసం ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఆ మాటలు చెప్పి 22 నెలలైపోతోంది. ఎందుకు చేయడం లేదు, ఎప్పుడు చేస్తారు అని ఉద్యమం చేస్తూ అడిగితే కుట్ర చేసి గొడవలు రేపి.. తిరిగి మా మీద అభాండాలు వేస్తారా?’’ అని జగన్ ప్రశ్నించాడు.
Tags:    

Similar News